ఇద్దరు చిన్నారుల గ్యాంగ్ రేప్: పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: ఇద్దరు చిన్నారులపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు చెప్పారు. పోలీసు కథనం మేరకు రెండు సంఘటనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పశ్చిమ ఢిల్లీలో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడు సంవత్సరాలు కూడా నిండని చిన్నారిని అపహరించిన కామాంధులు బాలిక మీద గ్యాంగ్ రేప్ చేశారు. తరువాత బాలికను ఇంటి సమీపంలోని పార్క్ దగ్గర వదిలి పరారైనారు.
అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక మీద అమానుషంగా అత్యాచారం చేశారని వైద్యులు తెలిపారు. బాలికకు శస్త్రచికిత్స చేశామని, పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
తూర్పు ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదు సంవత్సరాల పాపను పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి అతని ఇంటికి తీసుకు వెళ్లాడు. తరువాత తన స్నేహితులతో కలిసి బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు.

తీవ్ర రక్తస్రావంతో నిందితుడి ఇంటి నుంచి ఏడుస్తూ బయటకు వచ్చిన బాలిక కిందపడిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికను ఆసుపత్రికి తరలించామని పాప పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మొదటి కేసులో నిందితుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ రెండు సంఘటనలపై ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications