మావోల దాడి: 20 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుకుమా జిల్లా సోంపల వద్ద సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. మందుపాతర పేల్చి కాల్పులు జరపడంతో దాదాపు 20 మంది జవాన్లు మృతి చెందినట్లు సమాచారం. పదిహేను మంది వరకు గాయపడ్డారు. ఇద్దరు మావోలు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
మంగళవారం ఉదయం మావోయిస్టులు సిఆర్పీఎఫ్ జవాన్ల పైన మెరుపు దాడి చేశారు. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఈ గటన జరిగింది. సిఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తుండగా తాతాగఢ్ వద్ద మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు.

దీంతో జవాన్లు, మావోయిస్టుల మధ్య గంటకు పైగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రదేశం దట్టమైన అడవిలో ఉంది. దీంతో సమాచారం తెలిసేందుకు సమయం పట్టడమే కాకుండా, పూర్తి సమాచారం అందడం లేదు.
సంఘటన ప్రాంతానికి భారీగా భద్రతా దళాలు చేరుకుంటున్నాయి. అయితే, వారు వెళ్లే మార్గంలోను మందుపాతరలు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించేందుకు రెండు హెలికాప్టర్లను సిద్ధం చేశారు. 2013 మే తర్వాత ఇదే అతిపెద్ద దాడి. నాటి దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెసు నేతలు సహా 25 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications