బాలికగా వెళ్లి 21ఏళ్ల తర్వాత వివాహిత టెక్కీగా తల్లిదండ్రుల చెంతకు!
బెంగళూరు/చంద్రాపూర్: సినిమాల్లో జరిగే సంఘటన మాదిరిగానే మహారాష్ట్రలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల వయసులోనే ఇంటికి దూరమైందో బాలిక. ఆ తర్వాత ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. తల్లిదండ్రులకు దూరమై ఎన్నో కష్టాలు పడింది. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం సాధించింది. అయితే, ఆ ఆనందాన్ని తన తల్లిదండ్రులతోనే పంచుకోవాలనుకుంది.
అనేక ప్రయత్నాలు చేసిన ఆ యువతి.. చివరకు పోలీసుల సాయంతో తన కలను సాకారం చేసుకుంది. ఇల్లు విడిచిన 21 ఏళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రులను కలుసుకుంది. ఆ యువతే బెంగళూరుకు చెందిన 29ఏళ్ల జ్యోత్స్న ధావ్లే.
చంద్రాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోత్స్న ధావ్లే 1995లో తన 8వ ఏట మహారాష్ట్రలోని దత్తానగర్‌లో ఉండే తన ఇంటి నుంచి బయటకొచ్చింది. సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలెక్కి ముంబై వెళ్లింది. ఐదు రోజులు రైల్వే స్టేషన్లో ఉండి.. హైదరాబాద్ రైలెక్కింది.
హైదరాబాద్ చేరుకున్నాక.. జ్యోత్స్నను హోటల్ నడిపే ఓ మహిళ తన ఇంటికి తీసుకెళ్లి పనికి కుదుర్చుకుంది. కొన్నాళ్లకు ఆ కుటుంబం కేరళకు వెళ్లిపోయారు. అయితే జ్యోత్స్నను ఆ మహిళ కుటుంబసభ్యులు హింసించడంతో ఆమె వారింటి నుంచి తప్పించుకుని పారిపోయి బెంగళూరు చేరుకుంది.
బెంగళూరులో జ్యోత్స్న జీవితం మరో మలుపు తిరిగింది. రైల్వేస్టేషన్లో ఆమెను చూసిన చైల్డ్‌లైన్ పోలీసులు ఆమెను వసతి గృహంలో చేర్పించారు. అలా.. జ్యోత్స్న అక్కడే చదువు పూర్తిచేసింది. కొన్నేళ్ల తర్వాత తన స్నేహితుడు శివశక్తి అనే వ్యక్తిని పెళ్లాడింది.

ఆ తర్వాత బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. అయితే జీవితంలో స్థిరపడిన జ్యోత్స్నకు కన్నవాళ్లను కలుసుకోవాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. దీంతో గత మార్చి 16న తన స్వస్థలమైన చంద్రాపూర్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసింది జ్యోత్స్న.
తండ్రి పేరు నాందియో అని, ఆటోడ్రైవర్‌గా పనిచేస్తాడని చెప్పింది. ఇంటిపేరు మాత్రం ఆమెకు గుర్తులేదు. దీంతో పోలీసులు పాత రికార్డులన్నీ తిరగేశారు. కనిపించకుండా పోయినట్లు నమోదైన కేసులను పరిశీలించారు. స్థానిక ఆటోడ్రైవర్ల సాయంతో ఎట్టకేలకు నాందియో దంపతులను చేరుకుని వారి కుమార్తె బతికే ఉందన్న విషయాన్ని చెప్పారు.
20ఏళ్ల క్రితం కనబడకుండా పోయిన తమ చిన్నారి బతికున్న విషయం తెలియడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పోలీసుల సహకారంతో జ్యోత్స్న తన తల్లిదండ్రులను 21ఏళ్ల తర్వాత గురువారం కలుసుకుంది. తనను తల్లిదండ్రులతో కలిపిన చంద్రాపూర్ పోలీసులకు జ్యోత్స్న కృతజ్ఞతలు తెలిపింది.












Click it and Unblock the Notifications