కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై ఘాతుకాలు ఆగడం లేదు. కుదలుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు ఓ 23 ఏళ్ల యువతిపై శనివారంనాడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను తినుబండారాల దుకాణానికి వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు తన వద్దకు వచ్చి తమతో పాటు కారులో రావాలని అడిగారని, తాను తిరస్కరించానని, అయితే తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లారని ఆ యువతి తన ఫిర్యాదులో చెప్పింది.

తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో తాను ప్రతిఘటించానని, అయితే వారు తనపై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పింది. దాదాపు రెండు గంటల పాటు చిత్రహింసలు పెట్టిన తర్వాత యువతిని ఢిల్లీ పోలీసు కేంద్ర కార్యాలయానికి సమీపంలో గల సన్‌లైట్ కాలనీ ఫ్లైఓవరు వద్ద వదిలి వెళ్లారు.
కిడ్నాప్, అత్యాచారం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications