స్కూటీపై 1.6 లక్షల ఫైన్.. 311 కేసులు.. చివరికి ఏమైందంటే?
బెంగుళూరులో ఓ ద్విచక్ర వాహనదారుడు రికార్డుల్లోకెక్కాడు. అది కూడా మామూలు రికార్డు కాదు. ఏకంగా తన స్కూటీపై 311 కేసులు నమోదయ్యేలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి పోలీసులకు షాక్ ఇచ్చాడు.
ఈ తరహా రికార్డు సాధించిన వ్యక్తిని బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియాస్వామిగా గుర్తించారు. అతను ఓ ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ గా గుర్తించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, స్కూటీ డ్రైవ్ చేస్తూ మొబైల్ వాడకం లాంటి వాటితో పాటు సిగ్నల్ జంప్ సహా పలు కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది.
అయితే పెరియాస్వామి విషయాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. ఈ విషయాన్ని గత ఏడాది కాలంగా గమనిస్తున్న స్థానిక పౌరుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూటర్ పై అన్నీ కేసులు ఉండడం చూసి ఖంగు తిన్నారు. ఆ మొత్తం చలానాలు అన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే దాదాపు 20 మీటర్లు పొడవు వచ్చాయి. మొత్తంగా రూ.1,61,500 ఫైన్ విధించిన సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేశారు.

అయితే మరుసటి రోజే వాహనదారుడు పెరియాస్వామి.. ఆ చలానాలు చెల్లించి బైక్‌ను తీసుకువెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications