కేరళలో తొక్కిసలాట- నలుగురు దుర్మరణం: 64 మందికి పైగా గాయాలు
తిరువనంతపురం: కేరళ (Kerala) లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యూనివర్శిటీలో నిర్వహించిన మ్యూజికల్, టెక్ ఫెస్ట్ (Tech fest)లో తొక్కిసలాట (Stampede) సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు.
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించింది. కోచి- ఎర్నాకుళం సమీపంలోని కలమస్సేరిలో ఉంటుందీ యూనివర్శిటీ. క్యాంపస్‌లో ఉన్న ఆడిటోరియంలో శనివారం రాత్రి టెక్ ఫెస్ట్‌ను ఏర్పాటు చేసింది వర్శిటీ యాజమాన్యం. ప్లేబ్యాక్ సింగర్ నికిత గాంధీ (Nikhita Gandhi) ఇందులో పెర్‌ఫార్మ్ చేశారు.

ఆడిటోరియంలో పాసులను ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇచ్చింది యూనివర్శిటీ యాజమాన్యం. పాసులు లేని వారు ఆడిటోరియం వెలుపలే ఉంటూ అక్కడ అమర్చిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లపై ఈ ప్రోగ్రామ్‌ను తిలకించారు. క్యాంపస్ మొత్తం విద్యార్థులతో నిండిపోయింది. వారి ఆటపాటలతో మార్మోగిపోయింది.
అదే సమయంలో భారీ వర్షం కురవడంతో వారంతా ఆడిటోరియంలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. వారంతా ఒక్కసారిగా లోనికి వెళ్లడానికి ప్రయత్నించడంతో కొందరు విద్యార్థులు కిందపడ్డారు. కాళ్ల కింద నలిగిపోయారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఎర్నాకుళం జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడ్డ వారిలో 46 మందిని కలమస్సేరి మెడికల్ కాలేజీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ 18 మందిని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు.

ఈ ఘటన పట్ల కేరళ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కోజికోడ్‌లో ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం అయ్యారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ బిందు, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇందులో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించినట్లు వీణా జార్జ్ తెలిపారు. యూనివర్శిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని డాక్టర్ బిందు చెప్పారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications