ఎన్‌కౌంటర్: సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం, ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో గురువారం భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. షోపియాన్ జిల్లాలోని జైనాపోరా ప్రాంతంలోని బడిగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.
మరోవైపు, ఒక విషాద సంఘటనలో, ఆపరేషన్‌లో పాల్గొనడానికి ఎన్‌కౌంటర్ ప్రదేశానికి వెళుతున్న ఇద్దరు ఆర్మీ సిబ్బంది వారి వాహనం ప్రమాదానికి గురై మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

"44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మీ పార్టీ సుమోలో బడిగం జైనాపోరా వద్ద ఎన్‌కౌంటర్ సైట్ వైపు వెళుతుండగా, చౌగామ్ షోపియాన్ సమీపంలో వాహనం ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు, ఇద్దరు గాయపడ్డారు," అని ఓ సైనికాధికారి తెలిపారు.
బడిగం వద్ద ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందిందని, వారు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. మరణించిన ఉగ్రవాదుల గురించిన సమాచారం తెలుసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications