కరోనా వ్యాక్సిన్‌పై సర్వే... దేశంలో ఎంతమంది డబ్బులు చెల్లించి కొనేందుకు సిద్దంగా ఉన్నారు?
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులివ్వగా... భారత్ వచ్చే ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ చేపట్టే యోచనలో ఉంది. ఈ పక్రియకు సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు కరోనా ఉచిత వ్యాక్సినేషన్‌కు హామీలు కూడా ఇచ్చాయి. అయితే భారత్‌లో ప్రజలు ఉచిత వ్యాక్సినేషన్ కోరుకుంటున్నారా... లేక వ్యాక్సిన్‌కు డబ్బులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారా...? ఇదే అంశంపై గావ్ కనెక్షన్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇవీ సర్వే వివరాలు
గావ్ కనెక్షన్ సర్వే ప్రకారం... దేశంలోని 44శాతం మంది గ్రామీణులు కరోనా వ్యాక్సిన్‌ను డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. 36శాతం మంది గ్రామీణులు వ్యాక్సిన్ కోసం తాము డబ్బులు చెల్లించాలనుకోవట్లేదన్నారు. మిగతా 20శాతం మంది తాము ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదన్నారు. వ్యాక్సిన్ కోసం డబ్బులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పిన 44శాతం మందిలో మూడింట రెండొంతుల మంది రెండు డోసుల వ్యాక్సిన్ కోసం రూ.500 వరకు చెల్లించగలమని చెప్పారు.

చైనా కుట్రగా...
సర్వేలో పాల్గొన్నవారిలో 51శాతం మంది కరోనా వైరస్ సంక్షోభాన్ని చైనా కుట్రగా అభిప్రాయపడ్డారు. మరో 18శాతం మంది కరోనాను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 20శాతం మంది ప్రజలు దీన్ని దేవుడిగా చర్యగా పేర్కొనడం గమనార్హం. కరోనా పట్ల ప్రజలు చాలా అలసత్వంగా,నిర్లక్ష్యంగా వ్యవహరించారని 22శాతం మంది అభిప్రాయపడ్డారు. 18శాతం మంది తమ అభిప్రాయాలను వెల్లడించలేదు.

16 రాష్ట్రాల్లో సర్వే...
ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు,ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 60 జిల్లాల్లో దాదాపు 6040 మంది నుంచి గావ్ కనెక్షన్ సంస్థ అభిప్రాయాలు సేకరించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10వ తేదీ మధ్యలో వ్యక్తులతో ముఖాముఖిగా ఈ సర్వే నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా దేశంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సర్వే నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వేలో 5శాతం ఎర్రర్(లోపం) ఉండవచ్చునని... 95శాతం కచ్చితత్వం ఉంటుందని చెప్పారు. నార్త్ జోన్‌లో ఉత్తరప్రదేశ్,బిహార్,జార్ఖండ్,హిమాచల్ ప్రదేశ్,పంజాబ్,జమ్మూకశ్మీర్,హర్యానా,సౌత్ జోన్‌లో కేరళ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,వెస్ట్ జోన్‌లో మహారాష్ట్ర,గుజరాత్,మధ్యప్రదేశ్,ఈస్ట్ జోన్‌లో ఒడిశా,బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సర్వే చేపట్టినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications