పెను విషాదం: ఫ్రిడ్జ్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ (Jalandhar) జిల్లాలో పెను ప్రమాదం ఏకంగా ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇంటిల్లిపాది ఆదివారం రాత్రి టీవీ చూస్తుండగా పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశ్ పాల్ గాయ్(70), ఆయన కుమారుడు ఇంద్రపాల్ (41), కోడలు రుచి గాయ్(40), వారి 14 ఏళ్లలోపు వయస్సున్న ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్ మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.

ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్ ను ఆస్పత్రికి తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించారు. పేలుడుకు గల అసలు కారణం మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలికి చేరుకుని నమూనాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటంబంలో ఆరుగురు మృతి చెందడంతో వారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. అయితే, ఫ్రిడ్జ్ పేలి ఆరుగురు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రిడ్జ్ ఇంత ప్రమాకరమా? అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications