Niti Aaayog Meet : నీతి ఆయోగ్ భేటీకి కేసీఆర్ సహా ఏడుగురు సీఎంలు దూరం-జగన్, నవీన్ హాజరు..
జాతీయ స్ధాయిలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇవాళ ప్రధాని మోడీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ పాలకమండలి భేటీ ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి ఏడుగురు ముఖ్యమంత్రులు రాకుంా దూరంగా ఉండిపోయారు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న బీజేపీ, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ మాత్రమే హాజరయ్యారు.
నీతి ఆయోగ్ భేటీకి దూరంగా ఉండిపోయిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, కర్నాటక ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. అలాగే హాజరైన వారిలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కాని వారిలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అనారోగ్య కారణాలతో హాజరు కావడం లేదని సమాచారమిచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన గైర్హాజరుకు కారణాలు చెప్పలేదు. కేంద్రంపై ఢిల్లీపై జారీ చేసిన ఆర్డినెన్స్ ను కారణంగా చూపుతూ సీఎం కేజ్రివాల్ రాలేనని చెప్పేశారు. పంజాబ్ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని, అందుకే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ కేంద్రానికి లేఖ రాశారు.
బీజేపీయేతర ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నారంటే కేంద్రం వారి పట్ల సరైన రీతిలో వ్యవహరించడం లేదని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రాన్ని ఎవరు పట్టించుకోకపోయినా నీతి ఆయోగ్ తమ డిమాండ్లను వినడం లేదని ఆయన అన్నారు. మరోవైపు నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మోడీ సీఎంలతో చర్చిస్తారు.












Click it and Unblock the Notifications