పిల్లలు జరభద్రం: 18 ఏళ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా: మూడు రాష్ట్రాల్లో భారీగా కేసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ కట్టుతప్పినట్టే కనిపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అనేక రాష్ట్రాలకు విస్తరించింది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 300లకు దాటేసింది. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో వాటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొత్తగా తమిళనాడులోనూ ఎంట్రీ ఇచ్చింది కొత్త మహమ్మారి. ఒకేసారి 31 కేసులు అక్కడ రికార్డయ్యాయి. ఈ కేసులు ఇక్కడితో ఆగిపోతాయనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు.

మధ్యప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ..
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కోట్లాదిమంది ఒకేచోట గుమికూడటం ఏ మాత్రం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలు రాత్రి పూటే నిర్వహించే పరిస్థితి ఉన్నందున.. దీన్ని నివారించడానికి కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

పిల్లలపై పంజా..
ఇందులో భాగంగా- నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్ దీన్ని అమలు చేసింది కూడా. ఒమిక్రాన్ వేరియంట్ కొత్తగా పిల్లలపై పంజా విసిరుతోంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వేసిన అంచనాలన్నీ నిజం అయ్యాయి. పిల్లలు, 18 సంవత్సరాల లోపు యుక్త వయస్కులకు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సోకుతుందంటూ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఇదివరకే హెచ్చరించారు.

మూడు రాష్ట్రాల్లో..
దీనికి అనుగుణంగా ఇప్పుడు పిల్లలపై ప్రభావాన్ని చూపుతోందీ వేరియంట్. ప్రత్యేకించి- మూడు రాష్ట్రాల్లో పిల్లల్లో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో పిల్లలు దీని బారిన పడ్డారు. మొత్తంగా తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి. మహారాష్ట్రలో కొత్తగా 23 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో నాలుగు 18 సంవత్సరాల్లోపు వారికి సోకినవే.

టీనేజర్లకు ఒమిక్రాన్..
గుజరాత్‌లో ఏడు కొత్త ఒమిక్రాన్ కేసుల్లో మూడు, కర్ణాటకలో 13కు రెండు ఒమిక్రాన్ కేసులు టీనేజర్లలో కనిపించాయి. మొత్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇప్పటిదాకా తొమ్మిదిమంది టీనేజర్లు ఆసుపత్రుల పాలయ్యారు. కర్ణాటకలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 13 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11, తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలు ఉన్నారు. 11 సంవత్సరాల వయస్సున్న బాలిక బ్రిటన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.

కొత్త వేరియంట్..
తొమ్మిదేళ్ల బాలిక స్విట్జర్లాండ్ నుంచి మంగళూరుకు వచ్చారు. ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్ధారించగా.. పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్‌ను పంపించారు. అవి కూడా పాజిటివ్ రిపోర్ట్స్‌గా తేలాయి. వారిని ప్రత్యేక ఐసొలేషన్ వార్డులకు తరలించారు అధికారులు. వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అన్ని కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించినప్పటికీ.. వైరస్ సోకిందని చెబుతున్నారు.
Recommended Video

పిల్లలకు వ్యాక్సిన్..
ప్రస్తుతం దేశంలో 18 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీనివల్లే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వారికి సోకుతోందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఫ్రాన్స్‌లో అయిదేళ్లు, అంతమించిన వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇదే జాబితాలో అమెరికా, జర్మనీ, గ్రీస్, స్పెయిన్ ఉన్నాయి. ఆయా దేశాల్లో 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేస్తోన్నారు. భారత్‌లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలన దశలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications