Milk: కర్ణాటక, కేరళ మధ్య పాల జగడం.. మధ్యలో అమూల్..!
రాష్ట్రాల మధ్య జల జగడం విన్నామ.. కానీ పాల జగడం విన్నామా.. అవును ఇప్పుడు కేరళ, కర్ణాటక మధ్య పాల రగడ మొదలైంది. కర్ణాటక మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నందిని పేరిట పాల ఉత్పత్తులను అమ్ముతుంది. అయితే తాజాగా కర్ణాటక మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నందిని పాల ఉత్పత్తుల ఔట్ లేట్లను కేరళలో ఓపెన్ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య పాల జగడం మొదలైంది. కేరళలో ఇప్పటికే కేరళ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్- మిల్మా పేరిట పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
అక్కడ నంది ఔట్ లేట్లను ఓపెన్ చేయడంపై కేరళ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. లక్షలాది మంది పాడి రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సహకార వ్యవస్థకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మిల్మా తప్పుబట్టింది. కొన్ని రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర పాల సహకార సంఘాలు తమ రాష్ట్రాల పరిధులను దాటి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయని మిల్మా ఛైర్మన్ కేఎస్ మణి చెప్పారు. ఇది సమాఖ్య, సహకార స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు.

సహకార స్ఫూర్తికి ప్రాణం పోసిన త్రిభువన్‌దాస్, వర్గీస్ కురియన్ వంటి మహానుభావుల ఆదర్శాలకు వ్యతిరేకమని తెలిపారు. కర్ణాటకలో అమూల్ పాల ఉత్పత్తులను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నందిని బ్రాండ్‌ను ప్రమోట్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని మణి ప్రశ్నించారు. ఈ ధోరణి రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమన్నారు.

కర్ణాటలో అమూల్ ఔట్ లేట్లు తెరవడానికి ముందుకొచ్చింది. అయితే దీన్ని కర్ణాటక మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ అమూల్, నందినిల పేరుతో వివాదం రాజుకోవడం, కేరళ నందిని ఔట్ లేట్లపై అభ్యంతరం చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications