మోనిక దారుణ హత్య- పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్..
Karnataka: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పెళ్లి విషయంలో తన మాట వినట్లేదనే కారణంతో కన్నతండ్రే ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. పరువు హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దుమారానికి దారి తీసింది.
హత్యకు గురైన యువతి పేరు మోనికా మోతీరామ్ జాదవ్. వయస్సు 18 సంవత్సరాలు. కర్ణాటక బీదర్ జిల్లా ఔరద్ తాలూకా పరిధిలోని బరెగావ్ తండాలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోన్నారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఔరద్‌కు చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.

పెళ్లి సంబంధాలు చూస్తోండటంతో తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రేమ వివాహాన్ని ఆమె తల్లి భాగుబాయి అంగీకరించినప్పటికీ తండ్రి మోతీరామ్ మాత్రం ససేమిరా అన్నాడు. మరో కులానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి.
శనివారం మరోసారి ఈ విషయంపై ఘర్షణ చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఉన్న మోతీరామ్ విచక్షణ కోల్పోయాడు. మోనికను బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. కుమార్తె హత్యోదంతంపై తల్లి భాగు బాయి సంతేపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యదు చేశారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం ఔరద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల మోనికా జాదవ్ మృతి చెందినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో తేలిందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మోతీరామ్ కోసం గాలిస్తోన్నామని, అతనిపై హత్యకేసు నమోదు చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications