జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..!!
Ceasefire: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు.
ఈ పరిణామాల మధ్య షోపియాన్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రత బలగాలు- ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. జిల్లాలోని షుక్రూ ప్రాంతంలో కొద్దిసేపటి కిందటే ఎదురుకాల్పులు ఆరంభం అయ్యాయి. తుపాకుల శబ్దంతో ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లుతోంది.

షుక్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటువేసినట్లు పక్కా సమాచారం అందడంతో భద్రత బలగాలు, పారా మిలటరీ సిబ్బంది, జమ్మూ కాశ్మీర్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.
దీనితో భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. కనీసం నలుగురు ఉగ్రవాదులు ట్రాప్ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఎదురు కాల్పుల సందర్భంగా ఒక ఉగ్రవాది మరణించాడనీ సమాచారం అందింది. ఎన్‌కౌంటర్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ భారీ సంఖ్యలో భద్రత బలగాలు, పోలీసులను అక్కడికి తరలిస్తోన్నారు.
తొలుత ఈ ఎన్‌కౌంటర్ కుల్గాంలో ఆరంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ తరువాత క్రమంగా షోపియన్ జిల్లా అటవీ ప్రాంతానికి విస్తరించినట్లు చెప్పారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులు దాదాపు రెండు గంటలుగా ఉగ్రవాదులతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు.
భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉగ్రవాదులు ఇంకా జమ్మూ కాశ్మీర్‌లోనే తిష్ట వేశారనడానికి ఈ సంఘటనను తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు కన్నుమూసినప్పటి నుంచీ ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications