
వచ్చే వందేళ్ళ కోసం రూపొందించిన ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్; పేదల సంక్షేమానికి ప్రాధాన్యత: ప్రధాని మోడీ
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అందరికీ ముఖ్యంగా పేదలు మరియు సమాజంలోని వెనుకబడిన వర్గాల వారికి ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇది వెనుకబడిన లేదా వేతనాలు పొందుతున్న మధ్యతరగతి వర్గాలకు అందించేది ఏమీ లేదని ప్రతిపక్షాల వాదనలకు ప్రతిస్పందించారు. బడ్జెట్‌పై ప్రారంభ ప్రతిస్పందనలలో, ఇది ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి చేసిన బడ్జెట్ అని,ఈ బడ్జెట్ ప్రజలకు అనుకూలమైనది మరియు ప్రగతిశీలమైనది అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వచ్చే వందేళ్ళ కోసం రూపొందించిన బడ్జెట్ అన్నారు మోడీ.

యువత భవిష్యత్ కోసం రూపొందించిన బడ్జెట్
యువత ఉజ్వల భవిష్యత్తు కోసం బడ్జెట్ రూపొందించామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. వచ్చే పాతికేళ్ళ కోసం ప్లాన్ చేస్తూ ఈ బడ్జెట్ రూపొందించామని పేర్కొన్న మోడీ ,అన్ని రంగాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత వృద్ధి మరియు మరిన్ని ఉద్యోగాల కోసం కొత్త అవకాశాలతో నిండి ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇది హరిత ఉద్యోగాల రంగాన్ని కూడా ఆవిష్కరిస్తుందని మోడీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశం ఏమిటంటే పేదల సంక్షేమం. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సరైన దిశలోనే ఉందని పేర్కొన్న మోడీ టెక్నాలజీపై, ఇంటర్నెట్ పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.

బడ్జెట్ లో అత్యంత ముఖ్యమైన అంశం పేదల సంక్షేమం
గంగానది ప్రక్షాళనకు పెద్దపీట వేశామని పేర్కొన్న మోడీ, గంగా నది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్ తో 68 శాతం దేశీయ పరిశ్రమలకు లాభం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు వచ్చాయని, ప్రతి పేదవాడికీ సొంతిల్లు ఉండాలని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉండాలని మోడీ వెల్లడించారు. కిసాన్ డ్రోన్లు, డిజిటల్ కరెన్సీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బడ్జెట్ లో అత్యంత ముఖ్యమైన అంశం పేదల సంక్షేమం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

పేదల మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాం
ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు, కుళాయి ద్వారా నీరు, మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన తెలిపారు. సామాన్య ప్రజల నుండి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారతదేశం అంతటా రైతుల బ్యాంకులకు నేరుగా బదిలీ చేయబడుతున్న 2.25 లక్షల కోట్ల రూపాయల గురించి మోడీ ప్రస్తావించారు. ఇది కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

రోడ్లు, హైవేలు, రైల్వేలు ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తుంది
ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండేలా తక్షణ అవసరాలను ఈ బడ్జెట్ ప్రస్తావిస్తుంది. ఇది మరింత పెట్టుబడి, మరిన్ని మౌలిక సదుపాయాలు, మరింత వృద్ధిని కూడా నిర్ధారిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. రోడ్లు, హైవేలు, రైల్వేలు - ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. పర్వత ప్రాంతాలను కలుపుతూ పర్వత మాల పథకాన్ని ప్రారంభించడం దేశంలోనే మొదటి సారి అని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.
Recommended Video

బ్యాంకింగ్ రంగంలో కొత్తగా డిజిటల్ యూనిట్లు, జాతీయ ఆరోగ్య పథకం కింద డిజిటల్ ఎకో సిస్టం
ఆధునిక రవాణా వ్యవస్థపై ప్రధానంగా దృష్టి సారించినట్లు మోడీ పేర్కొన్నారు. పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థను నిర్మించనున్నట్లు గా తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు పర్వత మాల పథకం వర్తిస్తుందని వెల్లడించారు. జాతీయ ఆరోగ్య పథకం కింద డిజిటల్ ఎకో సిస్టం ను తీసుకొస్తున్నామని, బ్యాంకింగ్ రంగంలో కొత్తగా డిజిటల్ యూనిట్లను తీసుకొస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.