రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 9మంది మృతి..
రాజస్థాన్‌లోని ఝాలవర్ జిల్లాల్లో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లిన కొందరు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ వ్యాను ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందగా, ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాద సమయంలో ఆ వ్యానులో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి వ్యానును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని తమ బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లిన కొందరు..పెళ్లి ముగిసిన తర్వాత తమ స్వస్థలానికి బయలుదేరే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘోర ట్రక్కు ప్రమాదంలో
అక్కడిక్కడే ముగ్గురు చనిపోతూ, చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతిచెందారు. ఈ ట్రక్కు ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..
మధ్యప్రదేశ్‌లోని ఖల్చిపూర్‌లోని బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ ట్రక్కు డ్రైవర్‌ను వెంటనే పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications