ఎలా చిక్కిందో గానీ.. బెంగళూరు డొంక కదిలింది!!
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి అనంతరం దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికపై నిఘా తీవ్రతరమైంది. అన్ని రాష్ట్రాల్లో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ యాక్టివేట్ అయ్యాయి. టెర్రరిస్టుల షెల్టర్ జోన్ గా పరిగణించే ప్రాంతాలపై డేగకన్ను వేశాయి. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేశాయి.
ఈ క్రమంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఓ బిగ్ బ్రేక్ థ్రూ సాధించారు. భయానక ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె పేరు సమా పర్వీన్. వయస్సు 30 సంవత్సరాలు. బెంగళూరులో నివాసం ఉంటోదామె.

బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి తెలిపారు. భారత ఉపఖండంలో అల్ ఖైదా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల మాడ్యూల్ వెనుక ఉన్న కీలక సూత్రధారిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు.
సమా పర్వీన్.. ఈ టెర్రర్ మాడ్యూల్ మొత్తాన్ని కూడా నడుపుతున్నారని, బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుండి తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్నారని చెప్పారు. భారత ఉపఖండంలో గల ఇతర ఉగ్రవాద సంస్థలను సమన్వయం చేస్తోన్నారని, దీని వెను ప్రధాన నిర్వాహకురాలిగా తమ విచారణలో తేలిందని అన్నారు.
దీనికి ముందు, ఇదే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న మరో నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు గుజరాత్ కు చెందిన వారు. ఒకరు నోయిడా, మరొకరు ఢిల్లీ నివాసులు. అహ్మదాబాద్‌కు చెందిన ఫర్దీన్ షేక్, సైఫుల్లా ఖురేషి, ఢిల్లీలో మహమ్మద్ ఫయిక్, నోయిడాకు చెందిన జీషన్ అలీ.. వారం రోజుల కిందట అరెస్ట్ అయ్యారు.
యూఏపీఏ, భారత్ న్యాయ సంహిత సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుత ఈ నలుగురూ రిమాండ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని విచారించారు పోలీసులు. తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో సమా పర్వీన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టారు. దీని ఆధారంగా బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేశారు ఏటీఎస్ అధికారులు.
సమా పర్వీన్ ను ఈ మధ్యాహ్నం కోర్టు ముందు హాజరుపరిచి, రిమాండ్ కోరే అవకాశం ఉంది. ఆమెను విచారిస్తే మరిన్ని అల్ ఖైదా లేదా ఇతర టెర్రర్ మాడ్యుల్స్ కు సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications