అధవ్ అర్జున కౌంటర్ అటాక్ స్టార్ట్- మంత్రి అయ్యేంత వరకూ ఆయన కులం ఏంటో తెలియదు
తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షం వీసీకే అధినేత తిరుమావళవన్ పై డీఎంకే సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు ఏ రాజా చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తిరుమావళవన్‌ను విమర్శించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తిరుమావళవన్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం వీసీకే, ఐయూఎంఎల్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.
వీసీకేకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో చేరడంపై ఏ రాజా స్పందించారు. తిరుమావళవన్ పై ఘాటు విమర్శలు చేశారు. అధికారం కోసం అర్రులు చాస్తోన్నారనే విషయం స్పష్టమైందని, సిద్ధాంతాలన్నింటినీ వదిలిపెట్టారంటూ మండిపడ్డారు. దీనిపై అధవ్ అర్జున ఎదురుదాడికి దిగారు. చెన్నై సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుమావళవన్ పై ఏ రాజా విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు.

డీఎంకేలో గతంలో ఉన్న సామాజిక న్యాయ పరిస్థితులు ఇప్పుడు లేవనడానికి ఏ రాజా చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఆధవ్ అర్జున అన్నారు. డీఎంకే నాయకులు అదుపు తప్పారని, వాడకూడదని పదాలతో ఏ రాజా.. తమ మిత్రపక్షంపై విమర్శలు చేయడం సహేతుకం కాదని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా తప్పు పట్టేలా ఆయన వ్యవహరిస్తోన్నారని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌కు ఏ రాజా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజా చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి ఖండించాలని ఆధవ్ అర్జున డిమాండ్ చేశారు. మహిళా సంబంధాలను ప్రస్తావించి నాయకులను విమర్శించే వారిపై చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి విజయ్ ఏర్పాటు చేసిన కొత్త మంత్రివర్గాన్ని అధవ్ అర్జున ప్రశంసించారు. విజయ్ ఒక సామాజిక న్యాయం, లౌకిక మంత్రివర్గాన్ని రూపొందించారని, కులం, మతం, డబ్బు.. ఇటువంటి రాజకీయాలన్నింటినీ విజయ్ పక్కన పెట్టారని తేల్చి చెప్పారు.
కులం, కుటుంబ నేపథ్యం చూడకుండా అన్ని పార్టీలకు పాలనలో భాగం కల్పించి ఓ యువ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని ఆధవ్ అర్జున చెప్పారు. దేశమంతా చూసి అబ్బురపడేలా ఈ యువ మంత్రివర్గం ఉందని, యువత పాలనలో భాగం, అధికారంలో కూడా భాగం' అనే వాగ్దానం నెరవేరిందని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం గట్టిగా శ్రమించిన వారికే పదవులు ఇచ్చారని అధవ్ చెప్పారు. మంత్రిగా నియమించే వరకు రమేష్ కులం ఏమిటో కూడా తమకు తెలియదని స్పష్టం చేశారు. పెరియార్, అన్నాదురై, అంబేద్కర్ సిద్ధాంతాల మార్గంలోనే తమ ప్రభుత్వం నడుస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications