షాక్:ఆది అమావాస్య ప్రత్యేక పూజ -108 కిలోల కారం కలిపిన నీళ్లతో పూజారికి అభిషేకం -ఊరి మంచి కోసమేనట
కావడానికి ప్రజా ధనమే అయినా, పాలకులు ప్రకటించే ఒక్కో పథకానికి ఉప్పొంగిపోతూ ఆయా పార్టీల శ్రేణులు, అభిమానులు నేతలకు పాలాభిషేకాలు చేయడం ఇటీవల సాధారణంగా మారింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనైతే నేతలు దొరక్కిపోతే వారి చిత్రపటాలు, ఫ్లెక్సీలకూ పాలు, తేనే, నీళ్లతో అభిషేకించడం బాగా ఎక్కువైంది. అయితే, తమిళనాడులోని ఓ మారు మూల గ్రామంలో మాత్రం ఊరి బాగు కోసం పూజారికి కారం నీళ్లతో స్నానం చేయించే వింత ఆచారం కొనసాగుతోంది..

సాధారణంగా వంటల్లో కాస్త కారం ఎక్కువైతేనే అల్లాడిపోతాం మనం. కారంపొడి శరీరానికి తగిలినా, చిన్న రేణువైనా కంట్లో పడినా విలవిల్లాడిపోతాం. అలాంటిది ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు. ఆదివారం ఆది అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో వినూత్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు జరుగుతాయి. గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం చేస్తారు. భక్తులు మద్యం, సిగరెట్లు కూడా దేవుడికి సమర్పిస్తారు. అనంతరం సాంప్రదాయ వేడుక ప్రారంభమవుతుంది.

గ్రామ దైవానికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటారు. ఆ తర్వాత 'కారం యజ్ఞం'లో ఆయన పాల్గొంటారు. కొడవలి పట్టుకుని కూర్చొనే ఆయనపై 108 కేజీల కారం కలిపిన నీళ్లను భక్తులు తలపై నుంచి పోసి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
కాగా, భక్తులు కారం నీళ్లు పోసేంత వరకు పూజారి గోవిందం కదలకుండా మెదలకుండా ఉంటారు. మరోవైపు ఆ కారం ఘాటు వల్ల ఊపిరి పీల్చలేక భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అనంతరం పూజారి శరీరంపై కారం మరకలు పోయేంత వరకు లీటర్ల కొద్దీ మంచినీళ్లను భక్తులు ఆయనపై గుమ్మరిస్తారు. ఊరికి మంచి జరగడం నమ్మకమే అయినప్పటికీ, కారం నీళ్లతో స్నానం చేయడం పూజారిది సహసమే మరి.












Click it and Unblock the Notifications