రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసపై ఆమ్ ఆద్మీ రియాక్షన్... ఉద్యమాన్ని బలహీనపర్చే చర్యలని...
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. పరిస్థితి ఇంతలా దిగజారడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమంటూ విచారం వ్యక్తం చేసింది. గత రెండు నెలలుగా రైతు ఉద్యమం శాంతియుతంగా సాగిందని ఆమ్ ఆద్మీ గుర్తుచేసింది. మంగళవారం(జనవరి 26) చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నది బయటినుంచి వచ్చిన శక్తులేనని రైతు సంఘాల నేతలు చెప్తున్నట్లు పేర్కొంది. 'వాళ్లెవరైనా కావొచ్చు.. ఇలాంటి హింసాత్మక సంఘటనలు శాంతియుతంగా,క్రమశిక్షణగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని బలహీనపరుస్తాయి.' అని పేర్కొంది.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తొలినుంచి మద్దతునిస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే ఆయన పలుమార్లు డిమాండ్ చేశారు. మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలు రైతు ఉద్యమంపై ఆరోపణలకు తావిచ్చే అవకాశం ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ప్రకటన చేసింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీని పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్లతో పాటు ఖలీస్తాన్ ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులు హైజాక్ చేసే అవకాశం ఉందని... దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతోందని సోమవారం(జనవరి 25) పోలీస్ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాము శాంతియుతంగా చేపట్టిన ర్యాలీలోకి అసాంఘీక శక్తులు చొరబడ్డారని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించడం గమనార్హం. ఢిల్లీలో ఇవాళ చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను ఆ సంఘం ఖండించింది.హింసను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని... జరిగిన ఘటనలపై విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నవారికి తాము దూరంగా ఉంటామని చెప్పింది.
నిజానికి రాజ్‌పథ్‌లో నిర్వహించే రిపబ్లిక్ పరేడ్ ముగిసిన తర్వాత పోలీసులు రైతులను ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించారు. అయితే రైతులు మాత్రం అంతకుముందే సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకెళ్లడంతో
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలాచోట్ల రైతులు బారికేడ్లను తొలగించుకుని ట్రాక్టర్లతో దూసుకెళ్లారు. పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎర్రకోటలోకి చొచ్చుకెళ్లిన రైతులు అక్కడి స్తంభంపై రైతు జెండాను ఆవిష్కరించి రైతు అనుకూల నినాదాలు చేశారు. తద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రైతుల నుంచి ఒక సందేశం పంపించినట్లయిందని పలువురు రైతు నేతలు పేర్కొన్నారు.