కేజ్రీవాల్ స్కెచ్ మామూలుగా లేదుగా: రాజ్యసభకు పంజాబీల ఫేవరెట్ క్రికెటర్
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్‌లో..వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్‌కు ఆయన 18వ ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇన్‌ఛార్జ్ రాఘవ్ ఛద్దా హాజరయ్యారు.
అదే రోజు మధ్యాహ్నం భగవంత్ మాన్- సచివాలయంలో అడుగు పెట్టారు. బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఫైళ్లపై సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఖట్కర్ కలాన్ నుంచి ఆయన నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. నిరాడంబరంగా బాధ్యతలను స్వీకరించారు. అధికారాన్ని అందుకున్న తొలి రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని భగవంత్ వ్యాఖ్యానించారు.

పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసుకునేలా తొలి రోజే వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబీయులకు ఆరాధ్యుడైన మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. దీనితోపాటు స్పోర్ట్స్ యూనివర్శిటీలో కీలక బాధ్యతలను అప్పగించనుంది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న బలం 92. దీనితో అయిదుమందిని రాజ్యసభకు పంపించే అవకాశం లభించింది.
ఇందులో హర్భజన్ సింగ్ పేరును ఖరారు చేసింది. మరో నలుగురిని త్వరలోనే ఎంపిక చేయనుంది. దీనిపై హర్భజన్ సింగ్‌ను సంప్రదించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 10వ తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. భగవంత్ మాన్‌కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. భగవంత్‌ను తన స్నేహితుడిగా చెప్పుకొన్నారు.
Recommended Video

ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లడంతో రాజకీయ ఆరంగేట్రం మొదలైనట్టే. ఇదివరకే ఆయనను భారతీయ జనతా పార్టీ ఒకట్రెండు ఆఫర్లు ఇచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీ ఇచ్చిన ఈ టికెట్ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. రాజకీయల పట్ల ఆసక్తి లేదని చెప్పుకొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లడానికి హర్భజన్ అంగీకరించారు.












Click it and Unblock the Notifications