ఎన్నిక బాండ్లతో బీజేపీ జేబుల్లోకి లిక్కర్ స్కాం సొమ్ము ? ఆప్ సంచలన కౌంటర్.. !
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఖండిస్తూ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో డబ్బులు చేతులు మారాయంటూ ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆ డబ్బులు బీజేపీ ఖాతాల్లోకే వెళ్లాయంటూ ఎన్నికల బాండ్ల ఆధారాలను ముందుపెట్టి సంచలన కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి బీజేపీకి ఇచ్చిన విరాళాలను దీనికి ఆధారంగా ప్రస్తావించింది.
ఢిల్లీ మద్యం విధానంలో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి ఆప్ రూ.100 కోట్లు తీసుకోవడంలో సీఎం కేజ్రివాల్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ ఆరోపించిన నేపథ్యంలో ఆప్ స్పందించింది. రెండేళ్లుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ డబ్బు ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయారని ఆప్ విమర్శించింది. ఇప్పుడు ఎన్నికల బాండ్ల ద్వారా ఆ డబ్బు ఎటు పోయిందో తేలిందని ఆప్ మంత్రి అతిషి స్పష్టం చేశారు. అరబిందో ఫార్మా డైరెక్టర్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డి (వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు) ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.40 కోట్ల వరకూ విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

ఈ రెండేళ్లలో ఆప్ మంత్రుల నుంచి కానీ, కార్యకర్తల నుంచి కానీ ఈడీ, సీబీఐ ఒక్క రూపాయి కూడా గుర్తించలేకపోయాయని, ఆ డబ్బులు ఎటు పోయాయని మంత్రి అతిషి ప్రశ్నించారు. 2022 నవంబర్లో ఈడీ సమన్లతో విచారణకు వెళ్లిన శరత్ చంద్రారెడ్డి తాను ఎప్పుడూ కేజ్రివాల్ ను కలవలేదని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత అరెస్టు అయి జైలుకెళ్లిన తర్వాత మాత్రం మాట మార్చాడన్నారు. కేజ్రివాల్ ను కలిసి ఎక్సైజ్ పాలసీపై చర్చించానని చెప్పారని, ఆ తర్వాతే ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు.దీని ద్వారా అక్కడ ఏం జరిగిందో అర్ధమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications