Delhi Mayor : ఢిల్లీని మళ్లీ గెలిచిన ఆప్- మేయర్ గా షెల్లీ ఒబెరాయ్-34 ఓట్లతో బీజేపీకి ఝలక్ ...
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటర్లు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా తీర్పు ఇచ్చినా లెఫ్టినెంట్ గవర్నర్, నామినేటెడ్ సభ్యుల సాయంతో మేయర్ సీటు గెల్చుకోవాలన్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చేయడంతో ఆశలు వదులుకున్న బీజేపీకి ఇవాళ అధికారికంగా వెలువడిన ఫలితం గట్టి షాకిచ్చింది.
ఢిల్లీ కార్పోరేషన్ లోని 274 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్ కు 150 సీట్లు రాగా.. బీజేపీ 113కు పరిమితమైంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయంతో పది మంది నామినేటెడ్ సభ్యుల్ని నియమించుకున్న బీజేపీ.. తన బలాన్ని 123కు పెంచుకుంది. అలాగే కార్పోరేషన్లో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న ఢిల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాయంతో ఆప్ ను వెనక్కి నెట్టి మేయర్ స్దానం కైవసం చేసుకునేందుకు కాషాయ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.

ఇందుకోసం మూడుసార్లు మేయర్ ఎన్నిక సందర్భంగా రసాభాస చేస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నామినేటెడ్ ఓట్లు చెల్లవని తేల్చేసింది. దీంతో ఇవాళ ఎన్నికకు మార్గం సుగమమైంది.

ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నిక జరిగింది. ఇందులో ఆప్ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్ ఏకంగా 150 ఓట్లు సాధించారు. 8 మంది కార్పోరేటర్లు దూరంగా ఉండిపోయారు. దీంతో బీజేపీ ఓటమి ఖరారైంది. ఢిల్లీ మేయర్ గా ఎన్నికైన షెల్లీ ఓబెరాయ్ కు సీఎం అరవింద్ కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీజేపీ ఎత్తులు పారకపోవడంతో ఢిల్లీపై పట్టు సాధించాలన్న ఆ పార్టీ ప్రయత్నాలు మరోసారి విఫలమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications