గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్వి: ఈయన ఎవరంటే?
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్విని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు.
శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీలో గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జనరల్ సెక్రటరీ మనోజ్ సోరటియా ఉన్నప్పటికీ.. కేజ్రీవాల్ మాత్రం గాధ్వీ వైపే మొగ్గుచూపారు.

వారం రోజుల క్రితం గుజరాత్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటే బాగుంటుందనే అంశంపై ప్రజలను అభిప్రాయాలు కోరారు అరవింద్ కేజ్రీవాల్. ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో వారి నుంచి స్పందనను బట్టి గాధ్వీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రజాభిప్రాయం తీసుకున్నామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కాగా, గురువారం 10 మంది అభ్యర్థులతో కూడిన 9వ జాబితాను ఆప్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 118కి చేరుకుంది. 182 అసెంబ్లీ స్థానాలను కలిగిన గుజరాత్ రాష్ట్రానికి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
గాధ్వీ ప్రముఖ గుజరాతీ జర్నలిస్టు, టీవీ యాంకర్
కాగా, గుజరాత్‌లోని ప్రముఖ టీవీ జర్నలిస్టులు, యాంకర్లలో గాధ్వి ఒకరు. VTV న్యూస్‌లో అతని షో 'మహామంథన్' రాత్రి 8-9 గంటల నుంచి నడుస్తుంది. అయితే రేటింగ్‌లు ఎక్కువగా ఉండటంతో ప్రజాదరణ పొందిన డిమాండ్‌తో రాత్రి 9.30 వరకు పొడిగించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గాధ్వీకి మంచి గుర్తింపు లభించింది. తనను తాను నాయక్‌గా ప్రచారం చేసుకున్నారు గాధ్వి.
గాధ్వి జూన్ 14, 2021న అహ్మదాబాద్‌లో కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌లో చేరారు. అప్పటి నుంచి 'విలాసవంతమైన జీవితం' గడుపుతున్న ఈ టీవీ యాంకర్.. రోడ్డెక్కారు. గాధ్వీ 1,00,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications