ఏం హాలత్ అయింది: కాంగ్రెస్‌కు ఒక్క సీటే: అంతకుమించి ఇచ్చినా వేస్టే
Congress: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ.. మరో షాక్ ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించిన మొన్నటికి మొన్న ప్రకటించిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు ఢిల్లీలోనూ అదే వైఖరిని అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటిల్లో ఒక్క సీటును మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది.. అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ. అది కూడా పొత్తు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా బ్లాక్‌లో కొనసాగుతుండటం వల్లే ఆ ఒక్క సీటును కూడా ఇస్తామని తెలిపింది.
దీనికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరిస్తుందనే నమ్మకం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. మిగిలిన ఆరు స్థానాల్లో తాము పోటీ చేస్తామని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడిన ఓటింగ్ శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ ఒక్క సీటును కూడా గెలుచుకోవడం కష్టమేనని తేల్చి చెప్పారు.

పొత్తు ధర్మాన్ని పాటించాల్సి ఉంది కాబట్టే- కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటును కేటాయిస్తామని సందీప్ పాఠక్ చెప్పారు. కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇవ్వడం ఇది రెండోసారి. పంజాబ్‌లో అన్ని స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామంటూ స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. చండీగఢ్‌ను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 14కు చేరుతుంది. ఈ 14 చోట్లా పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఊసే ఎత్తలేదాయన. అంతకుముందు మమత బెనర్జీ..ఇదేరకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. రెండింటిని మాత్రమే కాంగ్రెస్ ఇస్తామని, మిగిలిన చోట్ల తామే పోటీ చేస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications