కేజ్రివాల్‌కు షాక్: ఆప్‌కు షాజియా ఇల్మీ, గోపీనాథ్ రిజైన్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకులుగా కొనసాగుతున్న షాజియా ఇల్మీ, కెప్టెన్ గోపీనాథ్ పార్టీలోని అన్ని బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన వీరిద్దరు పార్టీని వీడటం కొంత వరకు పార్టీకి నష్టంగా భావించవచ్చు.
ఈ సందర్భంగా షాజీయా ఇల్మీ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం లేకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. అరవింద్ కేజ్రివాల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అరవింద్ కేజ్రివాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అవినీతిని వ్యతిరేకంగా వచ్చిన కొత్త పార్టీ పక్కదారి పట్టిందని విమర్శించారు.

తమ నాయకత్వానికి, తమకు తీవ్ర విభేదాలున్నాయని కెప్టెన్ గోపీనాథ్ అన్నారు. కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన షాజియా ఇల్మీ ఓటమి పాలయ్యారు.
ఇది ఇలా ఉండగా తనపై అవినీతి ఆరోపణలు చేయడంతో భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ.. అరవింద్ కేజ్రివాల్ పై పరువు నష్టం కేసు పెట్టారు. దీంతో అరవింద్ కేజ్రివాల్‌ను కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రివాల్ తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ తీసుకోవడానికి నిరాకరించడంతో అరవింద్ కేజ్రివాల్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications