MH Elections:కేజ్రీవాల్ నిర్ణయం కలిసొచ్చేదెవరికి..!!
మహారాష్ట్ర.. జార్ఖండ్ లో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. రెండు రాష్ట్రాల్లోనూ కూటమి లే ప్రధానంగా పోటీలో ఉన్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాల తరువాత ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పైన జాతీయ స్థాయిలో ఆసక్తి కనిపిస్తోంది. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ పైన ఆప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. కేజ్రీవాల్ తాజా నిర్ణయం ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరికి కలిసి వస్తుందనేది ఇంట్రస్టింగ్ గా మారింది.
కేజ్రీ కీలక నిర్ణయం
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడే ఫోకస్ చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. దీని వెనుక అనేక కారణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా జరిగిన హర్యానా ఎన్నికల్లో ఆప్ కు అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ తో సీట్ల విషయంలో విభేదించి ఒంటరిగా పోటీ చేసిన ఆప్ ను హర్యానా ప్రజలు ఆదరించలేదు. ఎక్కడా ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే, కాంగ్రెస్ - బీజేపీ మధ్య గెలుపు ను డిసైడ్ చేసిన ఒక్క శాతం కంటే ఎక్కువ ఓట్లు మాత్రం ఆప్ దక్కిచుకుంది.

ఢిల్లీ పై నజర్
హర్యానా ప్రభావంతో కేజ్రీవాల్ జాగ్రత్త పడ్డారు. తమ కంచుకోట ఢిల్లీ పైనే ప్రధానంగా ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో, మహారాష్ట్ర తో పాటుగా జార్ఖండ్ లోనూ పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. తొలుత మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్ ఆసక్తి చూపించింది. కానీ, పార్టీ అధినాయకత్వం మాత్రం రాష్ట్ర యూనిట్ కు పోటీ పైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, అక్కడ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. అదే విధంగా జార్ఖండ్ లో ఆప్ కు ఏ మాత్రం పట్టు లేదు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటులో చీలక రాకూడదనే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రాబల్యం లేకనే
2019లో ఆప్ మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ లోనూ పోటీ చేసింది. మహారాష్ట్రలో ఆ ఎన్నికల్లో ఆప్ 24 సీట్లకు పోటీ చేయగా.. 23 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అదే విధంగా జార్ఖండ్ లో ఆప్ ఆ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 26 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది. దీంతో..ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేయకూడదని డిసైడ్ అయింది. పరోక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి సహకరించి.. ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా వారి మద్దతు పొందాలనేది కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ నిర్ణయం ఎవరికి మేలు చేస్తుంది.. ఢిల్లీలో ఎలాంటి సమీకరణాలకు కారణమవుతుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications