హీరో కమల్ హాసన్: హిందూ ఉగ్రవాదం, చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు హై కోర్టు ఆదేశాలు !
బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలని దాఖలు అయిన పిటిషన్ ను గురువారం మద్రాసు హై కోర్టు విచారణ చేసింది.
చెన్నై: బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలని దాఖలు అయిన పిటిషన్ ను గురువారం మద్రాసు హై కోర్టు విచారణ చేసింది. కమల్ హాసన్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారంలోపు చెప్పాలని చెన్నై నగర పోలీసు కమిషనర్ కు మద్రాసు హై కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది.
హిందూవుల్లో ఉగ్రవాదం ఉందంటూ ఇటీవల కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా హీరో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పెరంబూరుకు చెందిన జీ. దేవరాజన్ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దేవరాజన్ పిటిషన్ ను మద్రాసు హై కోర్టు విచారణ చేసింది. హీరో కమల్ హాసన్ మీద కేసు నమోదు అయినా పోలీసులు ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టులో చెప్పారు. కమల్ హాసన్ నిత్యం ఏదో ఒక విధంగా తమిళనాడు ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యాలని మతిలేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కోర్టులో వాదించారు.
డెంగ్యూ వ్యాదిని నివారించడానికి నీలవేంబు ఆయుర్వేద ఔషదం పంపిణి చేస్తుంటే ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేశారని, ప్రజలను ఆందోళనకు గురి చేశారని, తమిళనాడు ప్రభుత్వం మీద కక్షతోనే కమల్ హాసన్ ఇలా చేస్తున్నారని ఇదే సందర్బంలో పిటిషనర్ ఆరోపించారు.
కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలని మద్రాసు హై కోర్టు చెన్నై క్రైం బ్రాంచ్, సైబర్ క్రైం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకూ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ గుర్తు చేశారు. పిటిషనర్ దేవరాజన్ న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం కమల్ హాసన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారంలోపు చెప్పాలంటూ చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏకే. విశ్వనాథన్ కు నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications