హీరో అజిత్, నెచ్చెలి శశికళ నేడు భేటీ: ఏం జరుగుతోంది ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రముఖ నటుడు అజిత్ వారుసుడు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అజిత్ మాత్రం ఇన్నిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎక్కడా మీడియాకు ఇంత వరకు కనపడలేదు.
అయితే అన్నాడీఎంకేలో వర్గ పోరు మొదలైందని ప్రచారం జరుగుతున్న సమయంలో మంగళవారం అజిత్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ చేరుకుని నెచ్చెలి శశికళతో సమావేశం కానున్నారు. శశికళ, అజిత్ తమిళనాడు రాజకీయాల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ఈనెల 29వ తేదిన అన్నాడీఎంకే పగ్గాలు శశికళకు అప్పగించడానికి సిద్దం అవుతున్నామని ఆమె వర్గీయులు చెబుతున్న సమయంలోనే అజిత్ శశికళ భేటీ కావడానికి రంగం సిద్దం కావడంతో తమిళనాడు రాజకీయలు రసవత్తరంగా మారిపోయాయి. సీఎం పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టడానికి శశికళ పావులు కదుపుతున్నారని సమాచారం.

అజిత్, శశికళ పోయెస్ గార్డెన్ లో చర్చించే సమయంలో శశికళకు అత్యంత నమ్మకమైన ఇద్దరు సీనియర్ మంత్రులు మాత్రమే ఉండాలని, మిగిలిన వారిని లోపలికి అనుమతించకూడదని ఆమె వర్గీయులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే ఇన్ని రోజులు పోయెస్ గార్డెన్ కు దూరంగా ఉన్నఅజిత్ ఇప్పుడు ఎందుకు పోయెస్ గార్డెన్ వెళ్లి శశికళను కలుసుకుంటున్నారు ? అనే విషయం అంతుపట్టడం లేదు.
అన్నాడీఎంకే పగ్గాలతో పాటు శశికళకు సీఎం పగ్గాలు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నసమయంలోనే అజిత్ ఆమెను కలవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శశికళ, అజిత్ భేటీ అవుతున్నారని తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులలో ఆందోళన మొదలైయ్యింది. జయలలితను తల్లితో సమానంగా చూసుకునే అజిత్ పోయెస్ గార్డెన్ లో అడుగు పెడుతున్నసందర్బంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications