నటి రతి అగ్నిహోత్రికి భర్త వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు
ముంబై: బాలీవుడ్ నటి రతి అగ్నిహోత్రి తన భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తన భర్త అనిల్ విర్వాణీ పైన శనివారం నాడు స్థానిక వర్లీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రతి అగ్నిహోత్రి వయస్సు 54. ఆమె నిన్నటితరం హీరోయిన్.
తనను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని పైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిపారు.

కాగా, రతి అగ్నిహోత్రి బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. ప్రముఖ పాత్రలు పోషించారు. ఏక్ దుజే కేలియే చిత్రానికి గాను ఆమెకు ఫిలింపేర్ అవార్డు వచ్చింది. తెలుగులో పున్నమి నాగు తదితర చిత్రాల్లో కూడా ఆమె నటించారు. వ్యాపారవేత్త అయిన అనిల్ విర్వాణీని 1985లో రతి వివాహం చేసుకున్నారు. వీరికి 28 ఏళ్ల తనయుడు తనూజ్ ఉన్నాడు.
రతి అగ్నిహోత్రి తన భర్త అనిల్ పైన ఫిర్యాదు చేశారని, అతను తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారని, ఈ మేరకు తమకు కంప్లైంట్ చేశారని డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్ జయకుమార్ చెప్పారు. అనిల్ విర్వానీ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications