టీవీ నటికి వేధింపులు... రాత్రిపూట ఢిల్లీ రోడ్లపై భయానక అనుభవం... నలుగురి అరెస్ట్...
ఢిల్లీకి చెందిన ప్రముఖ టీవీ నటి ప్రాచీ తెహ్లాన్‌ను నలుగురు తాగబోతు ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె కారును వెంబడిస్తూ ఇంటివరకూ వెంటపడ్డారు. అసభ్య పదజాలంతో ఆమెను,ఆమె భర్తను దూషించారు. ఆకతాయిలు ఇంటిదాకా రావడంతో ప్రాచీ తెహ్లాన్ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం(ఫిబ్రవరి 3) నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

భయానక అనుభవం అన్న ప్రాచీ..
ఆకతాయిల వేధింపుల గురించి ప్రాచీ తెహ్లాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'ఇది గత రాత్రి నాకు ఎదురైన భయానక అనుభవం. నేనూ,నా భర్త ఢిల్లీలో జరిగిన ఓ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి పయనమయ్యాం. ఈ క్రమంలో మార్గమధ్యలో నలుగురు తాగుబోతులు వారి వాహనంతో మమ్మల్ని వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రక్కును మా కారు ఢీకొట్టబోయింది. ఎలాగోలా ఆ ఆకతాయిల నుంచి తప్పించుకుని మా కాలనీకి వచ్చేశాం. కానీ ఆ నలుగురు మా ఇంటి వరకూ వచ్చారు. కారు నుంచి బయటకు దిగి మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించారు.' అని ప్రాచీ తెహ్లాన్ పేర్కొన్నారు.

నాపై అత్యాచారం జరిగి ఉంటే..: ప్రాచీ
'నా సొంత సిటీలో,సొంత ఇంట్లో నేను సేఫ్‌గా ఉన్నానని ఇంకెప్పుడు ఫీల్ అవగలను.. ఢిల్లీలో నేను స్వేచ్చగా బయటకెళ్లి రాలేనా... ఒకవేళ ఈ ఘటనలో నాపై అత్యాచారం జరిగి ఉంటే.. లేదా నన్ను హత్య చేసి ఉంటే... సమాధానం లేని చాలా ప్రశ్నలున్నాయి. నాకే కాదు ఇలాంటి వేధింపులు ఎవరికైనా ఎదురుకావొచ్చు.' అని ప్రాచీ తెహ్లాన్ తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. సోమవారం(ఫిబ్రవరి 1) రాత్రి ఈ ఘటన జరగ్గా.. మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాచీ తెహ్లాన్ ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా...
ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా,ప్రాచీ తెహ్లాన్ 'దియా ఔర్ బాతీ హమ్' అనే టీవీ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో వచ్చిన పంజాబీ సినిమా 'అర్జన్'లో ఆమె నటించారు. ప్రాచీ నటి మాత్రమే కాదు.. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కూడా. 2010లో కామన్‌వెల్త్ క్రీడా పోటీలకు ఆమె ప్రాతినిథ్యం వహించారు. గతంలో భారత బాస్కెట్ బాల్ జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.