దిగొచ్చిన కేంద్రం- సుప్రీంకోర్టు ఎదుట అంగీకారం..!!
హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు జరిపేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో- కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గౌతమ్ అదాని సుమారు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడ్డారంటూ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దుమారానికి దారి తీసింది.

దర్యాప్తునకు ససేమిరా..
హిండన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేస్తోన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోందే గానీ జేపీసీతో దర్యాప్తు జరిపించడానికి ససెమిరా అంటోంది.

సుప్రీంకోర్టు జోక్యంతో..
ఈ పరిణామాల మధ్య తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. హిండన్ బర్గ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా చేర్చారు.

డెడ్ లైన్ ఇవ్వడంతో..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్.. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఈ నెల 13వ తేదీ నాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను సూచించింది. భవిష్యత్ లో ఇన్వెస్టర్ల సొమ్ముకు ఎలా రక్షణ కల్పిస్తారనేది తెలియజేయాలని పేర్కొంది. ఇప్పుడున్న నిబంధనలు ఎలాంటివనేది వివరించాలని ఆదేశించింది.

కమిటీ ఏర్పాటుకు..
ఇవ్వాళ మరోసారి ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అవసరమైన నిబంధనలను రూపొందించడానికి ప్రత్యేకంగా కమిటీని నియమించడానికి అంగీకరిస్తున్నట్లు చెప్పారు. కమిటీ ఏర్పాటులో కేంద్రప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

17వ తేదీకి వాయిదా..
మున్ముందు ఇలాంటి పరిణామాలు తలెత్తితే.. వాటిని ఎదుర్కోవడానికి సెబి సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ చెప్పారు. దీనిపై ఓ కమిటీని నియమించడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని వివరించారు. దీనితో- ఈ పిటీషన్ పై మలి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. కమిటీ ఏర్పాటుపై అంగీకారాన్ని లిఖితపూరకంగా తెలియజేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications