మురికివాడకు మహార్దశ.. అదానీ అండతో మోడల్ టౌన్ షిప్ గా మారనున్న ధారావి
ముంబైలోని మురికివాడగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ధారావి. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా ధారావి ఉంది. 641 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో సుమారు పది లక్షల మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఈ ధారావి పునర్నిర్మాణ బాధ్యతలను అదానీ గ్రూప్స్ ఛైర్మన్, సీఈఓ గౌతమ్ అదానీ తీసుకున్నారు.
అదానీ గ్రూప్ నకు చెందిన రియల్ ఎస్టేట్ విభాగం అదానీ రియాల్టీ.. ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వేలాది మంది నివాసితులకు ఆధునిక గృహాలు, వాణిజ్య కార్యాలయాలు, పారిశ్రామిక కేంద్రాలు, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, విశాలమైన పార్కులు, ముంబైలోని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానించే ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
అదానీ రియాల్టీ అనేది అదానీ సంస్థల్లో ఓ కీలకమైన సంస్థ. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో అదానీ రియాల్టీ స్థానం మరింత బలపడనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 14 బిలియన్ డాలర్ల ఆదాయంతో పాటు 3 బిలియన్ డాలర్ల లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది అదానీ రియాల్టీని పట్టణాభివృద్ధిలో ఒక శక్తివంతమైన సంస్థగా నిలబెడుతుంది. అదానీ రియాల్టీ ఇప్పటికే అనేక ప్రాజెక్టులను, ప్రభుత్వ కాంట్రాక్టులను ముంబైలో సొంతం చేసుకుని అభివృద్ధి చేస్తోంది. అరేబియా సముద్రం సమీపంలో ఒక కొత్త విమానాశ్రయాన్ని, ఒక హై-ఎండ్ వాణిజ్య సముదాయాన్ని కూడా నిర్మిస్తోంది. అయితే.. ధారవి ప్రాజెక్ట్ మాత్రం అన్నింటి కంటే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు.
ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్.. ప్రభావం చాలా గొప్పగా ఉండబోతోంది. దీని ద్వారా ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. వారికి గృహాలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉద్యోగాలు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

అదానీ దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ పైనే కాకుండా, ఒక స్వయం సమృద్ధి, సమ్మిళితమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఉంది. ధారావి పునర్నిర్మాణ ప్రాజెక్ట్ నమూనా విజయవంతమైతే, ఇది దేశవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రభుత్వ సహకారంతో సమాజాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చు, నగరాలను ఎలా మార్చవచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications