వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధీర్ రంజన్ చౌదరి: ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటారా... సోనియా గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న బీజేపీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని'గా సంభోదించిన తీరుపై దుమారం చెలరేగుతోంది. బీజేపీ నేతలు ఆ సంబోధనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సోనియాగాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మూడు రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు.

బుధవారం ఒక ధర్నా సందర్భంగా అధీర్ రంజన్ చౌదరి ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును "రాష్ట్రపత్ని"గా సంబోధించారు.

రాష్ట్రపతి భవన్‌కు వెళ్లేందుకు అనుమతించకపోవడంపై ఆయన స్పందిస్తూ, "నిన్న వెళ్లనివ్వలేదు. ఈరోజు కూడా వెళ్లి చూస్తాను. భారత రాష్ట్రపతి దేశంలో అందరివారు. రాష్ట్రపతి కాదు, రాష్ట్రపత్ని. భారత రాష్ట్రపత్ని అందరికోసం ఉన్నారు. మాకోసం ఎందుకు లేరు?" అని ప్రశ్నించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అధీర్ రంజన్ వివరణ

మరుసటి రోజు అధీర్ రంజన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, "క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదు. నేనెందుకు బీజేపీకి క్షమాపణలు చెప్పాలి? భారత రాష్ట్రపతి ఎవరైనా, ఆ వ్యక్తి మనందరికీ రాష్ట్రపతే అవుతారని నాకు తెలుసు. ఆ పదం ఒక్కసారే నా నోటి నుంచి వచ్చింది. అదీ పొరపాటున జరిగింది. కానీ అధికార పార్టీకి చెందిన కొందరు దీన్ని పెద్ద రభస చేస్తున్నారు. రెండు రోజుల నుంచి విజయ్ చౌక్ వైపు వెళుతుంటే మమ్మల్ని అడ్డుకుని 'ఎక్కడిని వెళ్తున్నారు?' అని అడుగుతున్నారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, రాష్ట్రపతిని కలవాలని చెబుతున్నాం. నిన్న పొరపాటున నా నోటి నుంచి ఆ పదం బయటికొచ్చింది. దానికి నేనేం చేస్తాను? నన్ను ఉరి తీయాలనుకుంటే, తీసేయండి. నిన్న ఆ జర్నలిస్టును ఆపడానికి ప్రయత్నించాను. కానీ, ఆయన వెళ్లిపోయారు. లేదంటే అప్పుడే ఆయనకు ఈ పదం పొరపాటున వచ్చిందని చెప్పి ఉండేవాడిని" అన్నారు.

అయితే, ఈ విషయం పార్లమెంటులో దుమారం లేపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. పార్లమెంటులో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి.

అధీర్ రంజన్ 'రాష్ట్రపత్ని' సంబోధనపై కాంగ్రెస్ కూడా బీజీపీకి క్షమాపణలు చెప్పింది.

రాష్ట్రపతిని అవమానించారని తనపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటులో మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని అధీర్ రంజన్ స్పీకర్‌ను కోరారు.

ద్రౌపది ముర్ము భారతదేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి. ఈ నెల ప్రారంభంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో, ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు. జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.

గతంలో ఆమె జార్ఖండ్ గవర్నరుగా దీర్ఘకాలం వ్యవహరించారు. అక్కడ కూడా ఆమె తొలి మహిళా, ఆదివాసీ గవర్నర్.

స్మృతి ఇరానీ ఏమన్నారు?

అధీర్ రంజన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలు తెలిపారు.

"రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెపై ద్వేషం చిమ్మింది, హేళన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆమెను కీలుబొమ్మగా పేర్కొంది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా ఆమెపై దాడులు ఆగలేదు.

ఈ దేశంలోని అత్యున్నత పదవిని ఒక గిరిజన మహిళ అలంకరించారనే సత్యాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ అంగీకరించలేకపోతోంది. సోనియా గాంధీ నియమించిన నాయకుడు అధీర్ రంజన్, ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని సంబోధించారు" అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు.

https://twitter.com/ANI/status/1552518026356207616

సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై సోనియా గాంధీని మీడియా ప్రశ్నించింది. ఆయన క్షమాపణలు చెబుతారా? అని అడిగింది.

"ఆయన క్షమాపణలు చెప్పేశారు" అని సోనియా గాంధీ బదులిచ్చారు.

https://twitter.com/ANI/status/1552530958297239552

మరోవైపు అధీర్ రంజన్ వ్యాఖ్యలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, "ఇది ఉద్దేశపూర్వకంగా మహిళలను అవమానించే వ్యాఖ్య (సెక్సిస్ట్ కామెంట్). సోనియా గాంధీ రాష్ట్రపతికి, దేశానికి క్షమాపణలు చెప్పాలి" అని అన్నారు.

https://twitter.com/ANI/status/1552533565732442112

ఇది గిరిజనులను, దేశ రాష్ట్రపతిని అవమానించడమేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. "ఆయన (అధీర్ రంజన్) వెంటనే క్షమాపణలు చెప్పాలి. అలాంటి వ్యక్తిని నియమించినందుకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి" అని డిమాండ్ చేశారు.

https://twitter.com/ANI/status/1552535397309116418

"ఈ అవమానాన్ని సహించం. ఒక దేశంగా, మహిళలుగా మేం దీనిని సహించలేం. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని అవమానంగా భావిస్తున్నవారు సిగ్గుపడాలి. వాళ్లు క్షమాపణలు అడగాలి" అంటూ బీజేపీ ఎంపీ రమా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://twitter.com/ANI/status/1552537671452413952

అధీర్ రంజన్ చౌదరి ఉద్దేశపూర్వకంగానే అలాంటి సంబోధన చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు.

"ఆయన ఉద్దేశపూర్వకంగానే అలాంటి సంబోధన చేశారు. అదీ రెండుసార్లు. ఇది చిన్న విషయమా? కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటుకు, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రపతిని ఏఆర్ చౌదరి అవమానించిన తీరు వాళ్ల మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. గిరిజనులను ఇలా అవమానించడాన్ని ఈ దేశం ఎన్నటికీ సహించదు. ఇంత జరిగినా, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు" అంటూ పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

https://twitter.com/ANI/status/1552551705648066561

"మీరు అధీర్ రంజన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తారా?" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోనియా గాంధీని ప్రశ్నించారు.

"కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ అలాంటి సంబోధనతో దేశ అత్యున్నత పదవిని అవమానించారు. ఇది ఆయన, ఆయన పార్టీలోని నీచ మనస్తత్వానికి నిదర్శనం. ఆ సంబోధన గిరిజనులకు, మహిళలకు అవమానకరం. రాష్ట్రపతి ఏ పార్టీకీ చెందినవారు కాదు, దేశం మొత్తానికి చెందినవారు" అని ఆయన అన్నారు.

"మీ పార్టీ నాయకుడు ఇలాంటి దుర్భాషలాడుతుంటే, మీరు అంగీకరిస్తారా? అని సోనియా గాంధీని ప్రశ్నిస్తున్నాను. దేశం కూడా ఇది తెలుసుకోవాలనుకుంటోంది. భారత దేశ చరిత్రలో రాష్ట్రపతిని ఇంతలా ఎవరూ అవమానించలేదు. సభలో సోనియా గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణ చెప్పాలి" అని అన్నారు.

గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును ఉద్దేశపూర్వకంగా అవమాననించడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

"ఈ అంశాన్ని లేవనెత్తి, కాంగ్రెస్ నాయకుల దౌర్జన్య వైఖరిని ఖండించినందుకు స్మృతి ఇరానీని అభినందిస్తున్నాను. దేశానికి, ఆదివాసీలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి" అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

https://twitter.com/bandisanjay_bjp/status/1552617520225431552

ఈ వివాదం తరువాత, సోనియా గాంధీ వెంటనే పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారని ఏఎన్ఐ తెలిపింది. ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరిలను కూడా పిలిచినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Adhir Ranjan Chaudhary: Draupadi Murmu is called 'Rashtrapatni'... BJP says Sonia Gandhi should apologize
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X