చౌదరిపై వేటు- అప్పటి వరకూ సస్పెన్షన్‌లోనే..!!
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడారు. దీనిపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని మోదీ జోస్యం చెప్పారు.
2014, 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, గత రికార్డులన్నింటినీ చెరిపివేస్తామంటూ ధీమాగా చెప్పారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మోదీ తప్పుపట్టారు. అసలు ఎలాంటి చర్చ పెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయని పేర్కొన్నారు.

మోదీ ప్రసంగానికి ముందు- అవిశ్వాస తీర్మానంపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడే సమయంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పదేపదే అడ్డుపడటం కనిపించింది. అధికార పార్టీ సభ్యులు దూకుడు ప్రదర్శించడం, కఠిన పదాలను వాడిన ప్రతీసారీ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి ప్రసంగానికి అడ్డు తగిలారు.
ఇది కాస్తా ఆయనపై వేటు పడటానికి కారణమైంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి అభ్యంతరకరంగా అడ్డుపడ్డారని భావించిన లోక్‌సభ స్పీకర్.. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుగుణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు.
ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై తన తుది నివేదికను సమర్పించే వరకు ఆయనపై విధించిన ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. సభ కార్యకలాపాలకు అధిర్ రంజన్ ప్రతీసారీ అంతరాయం కలిగించారని, ఉద్దేశపూరకంగా అడ్డుపడ్డారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఇలా అడ్డుపడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.
తాము పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని, చర్చల్లో పాల్గొన్న ప్రతీసారీ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు కూడా అధిర్ రంజన్ ఇలాగే ప్రవర్తించారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదిక అందేంత వరకూ ఆయన సస్పెన్షన్‌లో ఉంటారని చెప్పారు.












Click it and Unblock the Notifications