వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్ ఎల్‌జీబీటీ: 'వాళ్ళు నా అడ్రస్ కోసం వెతికారు... దొరికితే రాళ్ళతో కొట్టి చంపేసేవారు'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బెల్లా తోపాటు 30 మంది ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులను బ్రిటన్ కు చేర్చారు

''ఎల్‌జీబీటీ కమ్యూనిటీ ప్రజల గురించి వెతుకుతున్నామని చెప్పారు. వాళ్ల దగ్గర పేర్లున్నాయి. అడ్రస్‌లున్నాయి. మా ఇళ్ల కోసం వెతికారు. వీధుల్లో కనిపించిన జనాన్ని ఆపి ప్రశ్నిస్తున్నారు'' అని అఫ్గానిస్తాన్‌కు చెందిన అలీ (పేరు మార్చాం) గతంలో తాను చూసిన పరిణామాలను వివరించారు.

అలీ తన జీవితమంతా అత్యంత అప్రమత్తంగా గడిపారు. తన దేశంలోని అధికారులు ఆయనను బైసెక్సువల్ అని గుర్తించినట్లయితే, అలీ అరెస్టయ్యే వారు, కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చేది.

కానీ, ఇప్పుడు ఇంకా పెద్ద సమస్య వచ్చింది. తాలిబాన్లు ఏడాది కిందట అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్నాక, ఆయన దేశం వీడాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే షరియా చట్టం ప్రకారం స్వలింగ సంపర్కం అఫ్గానిస్తాన్‌లో మరణశిక్షకు అర్హమయ్యే నేరం.

తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన రాత్రి నుంచే, అలీ లాంటి వారి కోసం వేటాడటం మొదలుపెట్టారు. ''వాళ్లు మరీ అంత వెనకబడి లేరు. ఫోన్‌లు హ్యాక్ చేయగలరు. మెసేజ్‌లు చదవగలరు. ఒక చిన్న పాట పాడినా దాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు'' అన్నారు అలీ.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే, అలీ, ఇంకా ఆయనలాంటి 30 మంది సభ్యులను ఒక సీక్రెట్ మిషన్ ద్వారా దేశం దాటించారు. ఈ మిషన్ బ్రిటన్ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పని చేసింది. మొదటిసారిగా వారి నుంచి ఈ సమాచారాన్ని బీబీసీ సేకరించింది.

అప్పటి వరకు తన ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీని ఏనాడు దాచుకోని బెల్లా అనే టీచర్, తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ దేశం నుంచి ఎలా బయటపడాలన్న దానిపై ప్రయత్నాలు ప్రారంభించారు.

''తాలిబాన్లు నన్ను రాళ్లతో కొట్టి చంపేవారు. లేదంటే తగలబెట్టడమో, ఉరి తీయడమో, ఎత్తయిన బిల్డింగ్ నుంచి కిందకు నెట్టేయడమో చేసి చంపేసేవారు'' అన్నారు బెల్లా.

అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకోవడానికి ఎల్జీబీటీ కమ్యూనిటీకి సహకారం అందించే రెయిన్‌బో రైల్‌రోడ్ అనే కెనడియన్ సంస్థను బెల్లా సంప్రదించారు.

కానీ, దేశంలో నెలకొన్న అరాచక పరిస్థితుల కారణంగా రాయబార కార్యాలయాలన్నీ మూసివేయడంతో ఆమె అక్కడి నుంచి బయటకు రావడం కష్టమైంది. ఇందుకోసం ఆమె చాలా వారాలు ఎదురు చూడాల్సి వచ్చింది.

అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయి, ప్రమాదంలో పడిన ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రజలను అక్కడి నుంచి తరలించడానికి రెయిన్‌బో రైల్‌రోడ్ సంస్థ, యూకేకు చెందిన మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సీడీఓ)తో కలిసి తీవ్రమైన ప్రయత్నాలు చేసింది.

తనకు ఫ్లైట్ దొరికేదాక బెల్లా ఎంతో భయభయంగా గడిపారు. కేవలం ఆహారం కోసం తప్ప బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

''మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం’’ అన్న కవర్ స్టోరీ, చేతిలో పాస్‌పోర్ట్, కొన్ని దుస్తులతో ఆమె ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. తాను ఇంటిని వదిలి బయటకు రావడం ప్రమాదకరమని తెలుసు. కానీ, అఫ్గానిస్తాన్‌లోనే ఉండటం నూటికి నూరు శాతం ప్రాణాంతకం అన్నది ఆమె గ్రహించారు.

ఎయిర్‌పోర్ట్ దగ్గర ఆమెను తాలిబాన్లు పలుమార్లు తనిఖీలు చేశారు. ''బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. కానీ, నేను మాత్రం భయంతో వణికి పోయాను'' అన్నారామె.

విమానం ఎక్కిన తర్వాత బెల్లా నిట్టూర్చారు. కానీ, తన కుటుంబ సభ్యుల గురించి ఆమెలో ఆందోళన కొనసాగింది. వాళ్లను అలా వదిలేసి వచ్చినందుకు ఆమె బాధపడ్డారు.

ముఖ్యంగా తన జెండర్ ఐడెంటిటీని ఇన్నాళ్లు దాచుకోవాల్సి వచ్చినందుకు ఆమె చింతించారు. కానీ, అదే విమానంలో తనలాంటి వాళ్లు మరికొందరు ఉన్నారు.

ఆ సమయంలో తాము ఎవరికి ఎవరమో, ఎక్కడికి వెళుతున్నామో వారికి తెలియదు.

స్వలింగ సంపర్కుడైన అహ్మద్ (పేరు మార్చాం) అనే వ్యక్తి కూడా బెల్లా ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్నారు.

''ప్రతి ఒక్కరు అఫ్గానిస్తాన్ నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. ఎందుకంటే బతికుండాలంటే అదొక్కటే మార్గం'' అని యూత్ వర్కర్‌గా పని చేసిన అహ్మద్ అన్నారు.

ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులతో బెల్లా

జనం విమానాశ్రయాలకు పరుగెత్తుతున్నట్లు తాను విన్నానని గుర్తు చేసుకున్నారు అహ్మద్. మొదట తాను దేశం విడిచి వెళ్లడానికి భయపడ్డానని అహ్మద్ అన్నారు.

"నేను ఇంట్లోని ఒక చిన్న గదిలో దాక్కున్నాను. అప్పుడే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి సహాయం చేసే సంస్థ ఒకటి ఉందని తెలుసుకున్నాను'' అన్నారు

ఆన్‌లైన్‌లో దాని గురించి మరింత సమాచారం తెలుసుకున్న తర్వాత, ఆ సంస్థతో ఆయన టచ్‌లో ఉంటూ వచ్చారు. చివరకు ఆయనకు విమానంలో చోటు దక్కింది. ఆ విమానంలో తనలాంటి వారు చాలామంది ఉన్నారని అహ్మద్‌కు తెలిసింది.

''కాబూల్‌లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత వీరిని రక్షించాలన్న అవసరం కనిపించింది'' అని ఈ మిషన్‌లో పాల్గొన్న పాకిస్తాన్‌లో బ్రిటీష్ హైకమిషనర్ క్రిస్టియన్ టర్నర్ అన్నారు.

''ప్రయాణానికి ముందు వారు చాలా టెన్షన్‌కు గురయ్యారు. తాము వెళ్లగలమా లేదా అని వారు కంగారుపడ్డారు'' అన్నారు టర్నర్.

అఫ్గానిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం ఒక డిజాస్టర్‌ అని యూకే ఎంపీలు అంతకు ముందు ప్రభుత్వాన్ని విమర్శించా. అవసరమైన వారికి సాయం అందించడంలో విఫలమయ్యామని వారు అన్నారు.

అయితే, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సహాయ పడేందుకు యూకే ప్రభుత్వం చేపట్టి స్పెషల్ ఆపరేషన్ ప్రపంచంలోనే మొదటిది. ఈ కమ్యూనిటీకి సహాయం కోసం స్టోన్‌వాల్ వంటి స్వచ్ఛంద సంస్థలు బ్రిటన్ ప్రభుత్వాన్ని సాయం కోరాయి.

బెల్లా ప్రస్తుతం ఫ్లాట్‌లోకి మారారు, ఉద్యోగం కోసం వెతుకుతున్నారు

అఫ్గానిస్తాన్‌ దాటిన తర్వాత బెల్లా, అలీ, అహ్మద్‌ వంటి వారు మరో దేశానికి చేరుకున్నారు. యూకే రావడానికి ముందు వారి పేపర్లు ప్రాసెస్ అయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా వారి రూట్‌ను బయట పెట్టలేదు.

కోవిడ్ ఆంక్షల కారణంగా, క్వారంటైన్ హోటళ్లలో ఉంచారు. చివరకు వారిని ఒక బృందానికి అప్పగించారు.

హింస నుంచి తప్పించుకునే ఎల్జీబీటీ కమ్యూనిటీకి సహాయంగా నిలిచే స్వచ్ఛంద సంస్థ మైక్రో రెయిన్‌బో, యూకేలో ఈ వర్గం ప్రజలకు జీవితంపై అవగాహన కల్పించడం, వర్క్‌షాప్‌ల నిర్వహణతోపాటు లైంగిక ఆరోగ్య విద్య, మానసిక ఆరోగ్యానికి అవసరమైన సహాయం చేస్తుంటుంది.

ఆ స్వచ్ఛంద సంస్థ నేషనల్‌ మేనేజర్‌ మౌడ్‌ గోబాను కలుసుకున్నట్లు బెల్లా గుర్తు చేసుకున్నారు.

''ఆమెలో ఆకట్టుకున్న విషయం ఏంటంటే, తాను స్వేచ్ఛను ఆస్వాదిస్తోంది. ఎంతో ధైర్యంగా ఉంది'' అని బెల్లా గురించి మౌడ్ వ్యాఖ్యానించారు.

''ఈ ప్రయత్నం ఒక ముందడుగు'' అని మైక్రో రెయిన్ బో వ్యవస్థాపకుడు, సీఈవో సెబాస్టియన్ రోకా అన్నారు.

కొన్ని నెలలపాటు ఒక హోటల్ గదిలో ఉన్న తర్వాత బెల్లా బ్రైటన్ లోని సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లోకి మారారు.

కొన్నాళ్లపాటు యూనివర్సల్ క్రెడిట్ నుంచి వారానికి 80 పౌండ్లు స్వీకరించిన బెల్లా, ప్రస్తుతం యూకేలో వలంటీర్‌గా పని చేస్తూ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.

అయితే, చాలాకాలం పాటు తన ఐడెంటిటీని దాచుకున్న బెల్లా, ఇప్పుడు ఎల్జీబీటీ కమ్యూనిటీతో కలిసిపోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

''నేను ఒంటరిగా ఫీలువుతున్నాను'' అన్నారామె.

''దేన్నీ త్వరగా నమ్మవద్దు, ఒప్పుకోవద్దు అని నా మనసు నాకు చెబుతూనే ఉంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయి'' అన్నారామె.

ప్రస్తుతం పాజిటివ్‌గా ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

"ఒంటరితనం తాత్కాలికమే. భవిష్యత్తులో నేను నా గతాన్ని అంగీకరించి, చాలామంది స్నేహితులను సంపాదించుకోగలనని అనుకుంటున్నాను" అన్నారామె.

అహ్మద్ కాలేజీకి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు

బెల్లా మాదిరిగానే అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన ఎల్జీబీటీ కమ్యూనిటీ సభ్యులకు కొన్ని సమస్యలు ఉన్నాయి.

వారిలో కొందరు ఇప్పటికీ హోటల్ రూమ్‌లలోనే ఉంటున్నారు.

అహ్మద్ తరచుగా తన రూమ్ నుంచి బయటకు రాగలుగుతున్నారు. కాలేజీకి వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.

అప్పుడప్పుడు లోకల్ జాబ్ సెంటర్‌కు వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను సొంతంగా సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఫ్లాట్‌లోకి మారదామన్నది ఆయన ఆలోచన.

''ఇల్లు అనే ఎప్పటికైనా సురక్షితమైన ప్రదేశమని నాకు తెలుసు. మంచి ఉద్యోగం దొరుకుతుందని అనుకుంటున్నాను. ఆ వెంటనే ఇంటిలోకి మారిపోతాను'' అన్నారు అహ్మద్.

తనకు కొత్త జీవితం ఇచ్చిన యూకే ప్రభుత్వానికి రుణపడి ఉంటానని అలీ అంటున్నారు. అయితే, సోషల్ హౌసింగ్‌ కోసం బ్రిటన్‌లో ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారని, అందువల్ల తనను ఎవరైనా విమర్శించవచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు.

''ఇంటి సమస్యలు ఎలాగైనా పరిష్కరించుకోవచ్చు. కానీ, తాలిబాన్లతో చర్చలు జరగడం లేదు కాబట్టి, మా సమస్యలు ఇలాగే ఉంటాయి'' అని ఆయన అన్నారు.

''మేం ఎప్పటికైనా తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, అక్కడ మాకు ఇళ్లున్నాయి, కార్లున్నాయి. కానీ, అక్కడికి వెళితే హత్యకు కూడా గురి కావచ్చు'' అన్నారాయన.

జీవించడానికి ఇక్కడ ఏదో పని చేయాలని భావిస్తున్న అలీ, ''నేను ఎప్పటికైనా ఇంటికి వెళ్లాల్సి రావచ్చు. ప్రస్తుతానికైతే స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నాను'' అని అన్నారు.

ఎల్జీబీటీ కమ్యూనిటీ సమస్యల గురించి మాట్లాడటానికి బీబీసీ తాలిబాన్లతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, వారు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Afghanistan LGBT: 'They searched for my address...they would have stoned me to death'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X