‘ఈసారి ఎంబీబీఎస్ పాస్ చేయకుంటే ఆత్మహత్యే’
పాట్నా: ఓ విద్యార్థి ఎంబీబీఎస్ పాస్ అయ్యేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. చాలాసార్లు అంటే దాదాపు 20ఏళ్లకుపైగానే. ఈ క్రమంలో అలసిపోయిన ఆ విద్యార్థి ఈసారి తనను పాస్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. కాగా, ఇప్పుడు ఆ విద్యార్థి వయస్సు 52.
బీహార్ రాష్ట్రంలోని దర్బంగా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థి కపిల్ దేవ్(52) ఈ మేరకు అధ్యాపకులను బెదిరించాడు. ఈ కాలేజీలో కపిల్ దేవ్ 21ఏళ్లుగా ఎంబీబీఎస్ డిగ్రీ కోసం పాట్లుపడుతున్నాడు. ఇక ఫైనలియర్ పరీక్షలు పాస్ అయ్యేందుకు 15 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నాడు.
అయినా, పాస్ కాకపోవడం, ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తనను పాస్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెడ్ బీకే సింగ్‌కు కపిల్ మెసేజ్ పంపాడు. ఇది సున్నితమైన అంశం కావడంతో కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్కే సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినందుకు అతడిపై కేసు నమోదు చేసే అవకాశముంది. కాగా, విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కపిల్ మాట మార్చాడు. మెసేజ్‌లు పంపిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే.. తాను ఆత్మహత్య చేసుకోనని చెప్పాడు.
ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలు పాస్ కాకుంటే, మళ్లీ పరీక్షలు రాసేందుకు తనను అనుమతించరని చెప్పాడు. 1995లో అతను ఎంబీబీఎస్‌లో చేరాడు. అయితే, ఫైనలియర్ పరీక్షలు మినహా ఇతర పరీక్షల్లో కపిల్ పాసయ్యాడు. కాగా, 2దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎంబీబీఎస్ ఫైనలియర్ మాత్రం కపిల్ పాస్ కాలేకపోయాడు.












Click it and Unblock the Notifications