Adityal L1 mission: ఇక భగభగ మండే సూర్యుడిపై కన్ను: ఇంకొద్ది రోజుల్లో ఆ ప్రయోగం
బెంగళూరు: కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించింది. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.
చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్‌గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.

అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. దీనితో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఆవిర్భవించింది భారత్. ఇంతకుముందు- రష్యా (సోవియట్ యూనియన్), అమెరికా, చైనా ఈ ఘనతను సాధించాయి. దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం.. భారత్.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. భగభగమండే సూర్యుడిపై కన్నేసింది. ప్రచండ భానుడిపై అధ్యయనం చేయడానికి సంకల్పించింది. దీనికోసం ఇదివరకే ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది ఇస్రో. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను యాక్టివ్ మోడ్‌లోకి తీసుకుని రాబోతోంది.

సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్1ను ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తోన్నామని సోమనాథ్ తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్1 మిషన్ త్వరలో పట్టాలెక్కిస్తామని, సెప్టెంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోన్నామని అన్నారు.
ప్రయోగించిన రోజు నుంచి ఈ మిషన్ సూర్యుడిని సమీపించడానికి సుమారు 120 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సోమనాథ్ తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను దీనికోసం వినియోగిస్తామని వివరించారు. ఇప్పటికే ఈ రాకెట్, శాటిలైట్ బెంగళూరులోని యూఆర్ రావు సెంటర్ నుంచి శ్రీహరికోటకు చేరుకుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications