Raghav Chadha: రాఘవ్ చద్దాకు కేంద్రం కీలక పదవి..! బీజేపీ మార్క్ రివార్డ్..!
పార్లమెంట్ లో సామాన్యుల తరఫున ప్రశ్నలు అడిగి దేశం దృష్టిని ఆకర్షించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) .. తాజాగా ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందుకు ప్రతిగా ఇవాళ కేంద్రం ఆయన్ను కీలక పదవిలో నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆప్ నుంచి బీజేపీలో చేరినందుకు ఇచ్చిన గిఫ్టేగా ఇది అంటూ రాఘవ్ చద్దాపై సెటైర్లు పడుతున్నాయి.
ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ పిటిషన్ల కమిటీకి చైర్మన్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల కమిటీని పునర్‌వ్యవస్థీకరించిన తర్వాత.. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్.. ఆ కమిటీకి సభలోని 10 మంది సభ్యులను నామినేట్ చేశారు. అనంతరం రాఘవ్ చద్దా కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారని రాజ్యసభ నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ కమిటీని రాజ్యసభ ఛైర్మన్ మే 20 నుంచి అమల్లోకి వచ్చేలా పునర్‌వ్యవస్థీకరించారని అందులో పేర్కొన్నారు.

ఇప్పుడు చద్దా ఛైర్మన్ అయిన రాజ్యసభ పిటిషన్ల కమిటీలో ఆయనతో పాటు ఎంపీలు హర్ష్ మహాజన్, గులాం అలీ, శంభు శరణ్ పటేల్, మయంకుమార్ నాయక్, బీదా మస్తాన్ రావు యాదవ్, జెబి మాథర్ హిషాం, సుభాసిష్ ఖుంటియా, ర్వంగ్వ్రా నార్జరీ , పి. సంతోష్ కుమార్ ఉన్నారు. ఏప్రిల్ 26న రాఘవ్ చద్దా మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆప్ తన మూల సూత్రాలు, విలువలకు పూర్తిగా దూరమైందని ఆయన ఆరోపించారు. అవినీతిని నిర్మూలిస్తామని గంభీరమైన ప్రతిజ్ఞతో ఏర్పడిన పార్టీయే నేడు అవినీతిపరులు, రాజీపడిన వ్యక్తుల చేతుల్లోకి దారుణంగా పడిపోయిందన్నారు. వారి తప్పులలో భాగస్వామి కావడం ఇష్టం లేక సుమారు ఏడాది క్రితమే తాను ఆప్ కు దూరమయ్యానని కూడా ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications