మహువా మొయిత్రాను అలా వాడేసుకుంటున్న టీఎంసీ ? డిఫెన్స్ లో బీజేపీ !
ప్రశ్నకు నోటు కేసులో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై లోక్ సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ మహువా మొయిత్రా ఇప్పుడు పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కేంద్రం బిందువుగా మారుతున్నారు. ఎలాగో బహిష్కరణ జరిగిపోయింది కాబట్టి దీనిపై పోరాటం చేసినా బీజేపీ వెనక్కి తగ్గేలా లేదు. అందుకే ఆమెను రాజకీయంగా మరోలా వాడుకునేందుకు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు.
లోక్ సభలో ప్రశ్నకు నోటు కేసులో బీజేపీ పట్టుబట్టి మరీ మహువా మొయిత్రాను సస్పెండ్ చేయించింది. ఈ విషయం ముందే గ్రహించిన ఆమె.. నిన్న బహిష్కరణకు ముందే ఇప్పుడు జరిగే ద్రౌపదీ వస్త్రాపహరణం జరగబోతోందని ఎమోషనల్ డైలాగ్స్ వేయడం మొదలుపెట్టేశారు. జరిగే మహాభారతాన్ని చూడాలని పిలుపునిచ్చారు. అనుకున్నట్లుగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లోక్ సభ స్పీకర్ సాయంతో మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేయిచేసింది.

దీంతో ఇప్పుడు మహువా మొయిత్రాను నారీ శక్తికి ప్రతీకగా అభివర్ణిస్తూ బెంగాల్లో టీఎంసీ ప్రచారం ప్రారంభించింది. లోక్ సభ నుంచి బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఆమెను బహిష్కరించి అవమానించిందంటూ రోడ్లెక్కేందుకు సిద్ధమవుతోంది. దీంతో మహువా వ్యవహారం బెంగాల్ రాజకీయాల్ని కుదిపేస్తోంది. బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల్ని అణగదొక్కేసిన సీఎం మమతా బెనర్జీకి.. ఆ తర్వాత బీజేపీ రూపంలో కొత్త ప్రత్యర్ధి ఎదురైంది. దీంతో బీజేపీని పూర్తిస్ధాయిలో టార్గెట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మమత హ్యాట్రిక్ విజయం సాధించారు.
ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ మహువా బహిష్కరణ అంశాన్ని మహిళా ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు. దీంతో బీజేపీ బెంగాల్లో మరోసారి డిఫెన్స్ లో పడుతోంది. ఎన్నికల నాటికి మహువా మొయిత్రా కు అన్యాయం చేశారన్న అంశాన్ని ఓటర్లు ఆమోదిస్తే బీజేపీకి భారీ దెబ్బ తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications