పహల్గాం తర్వాత ఉగ్రవాదుల భారీ కుట్ర.. వారే టార్గెట్!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో మారణ కాండను సృష్టించిన ఉగ్రవాదులు మరోసారి భారీ విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే మౌలిక సదుపాయాలు, కాశ్మీర్ లోయలో పనిచేస్తున్న స్థానికేతరులతోపాటు, కాశ్మీరీ పండిట్‌లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు తెలిసింది. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న రైల్వే ఉద్యోగుల్లో అత్యధికుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే. దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

వీరితోపాటు కాశ్మీరీ పండిట్‌లే లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఐఎఎస్ఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితోపాటు శ్రీనగర్, గాందెర్బల్ జిల్లాల్లోని పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతా బలగాలు నిఘాను మరింత పెంచాయి.
రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను భగ్నం చేసేందుకు స్థానిక పోలీసులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కాగా, పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యటకులపై జరిపిన ఉగ్రవాదులు దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడం, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాకిస్థాన్‌కు సంబంధించి అన్నీ వీసాలను రద్దు చేయడం, అంతేకాకుండా దేశంలోని పాక్ పౌరులను తక్షణమే భారత్ విడిచివెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ చర్యలకు పాక్ కూడా కౌంటర్ చర్యలకు దిగింది.












Click it and Unblock the Notifications