కాంగ్రెస్ కు రేపు ముగ్గురు గాంధీల రాజీనామా ? సీడబ్లూసీ భేటీలో ప్రకటించే ఛాన్స్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో ఆ పార్టీని నడుపుతున్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఐదు రాష్ట్రాల పోరులో కాంగ్రెస్ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ వీరు పదవులు వదులుకునే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ ప్రచారానికి నైతిక బాధ్యత వహిస్తూ రేపు దాని అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ సమావేశంలో రాజీనామా చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉందనే విమర్శల నేపథ్యంలో వీరి రాజీనామాల నిర్ణయం ప్రాదాన్యం సంతరించుకుంది. కానీ గాందీ విధేయులతో నిండిన సీడబ్ల్యూసీ లో సభ్యులు ఈ రాజీనామాలపై ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

వాస్తవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవుల నుంచి తప్పుకుంటామని ప్రకటించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వీరు పదవులు వదులుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే సీడబ్ల్యూసీ సభ్యులు వారి రాజీనామాల ప్రతిపాదనను తిరస్కరించి పదవుల్లో కొనసాగాలని కోరారు. అయితే ఈసారి శాశ్వత నుండి ప్రత్యేక ఆహ్వానితుల వరకు 56 మంది సభ్యులను పిలిచినప్పటికీ, కొంతమంది సీడబ్ల్యూసీ సభ్యులు పార్టీలో మార్పులను కోరతారని తెలుస్తోంది. సోనియా, రాహుల్ కూడా పరిస్ధితి గతంలోలా లేదని గ్రహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి నిర్ణయం సీరియస్ గానే ఉండొచ్చని సమాచారం.
మరోవైపు జీ23 పేరుతో రెబెల్ రాజకీయాలు నడుపుతున్న నేతలు రేపు సీడబ్ల్యూసీలో సైతం వీరి రాజీనామాలకు పట్టుబట్టవచ్చని తెలిసినందునే ముందుగానే గాంధీలు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే వీరికి కౌంటర్లు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీలో గాంధీల విధేయులు కూడా ఎక్కువసంఖ్యలోనే ఉండటంతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications