west bengal West Bengal Assembly Elections 2021 mamata banerjee tmc trinamool congress bjp shivsena samajwadi party rjd support మమతా బెనర్జీ టీఎంసీ బీజేపీ శివసేన సమాజ్‌వాదీ పార్టీ ఆర్జేడీ మద్దతు politics
బెంగాల్ పోరులో దీదీకి అనూహ్య మద్దతు-ఎస్పీ, ఆర్జేడీ బాటలో శివసేన-బెంగాల్ టైగ్రెస్ అంటూ
పశ్చిమబెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా హోరాహోరీ పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బెంగాల్లో దీదీకి మద్దతిస్తామంటూ, ప్రచారం చేస్తామంటూ పలు పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన కూడా మమతకు మద్దతు ప్రకటించింది. ఈసారి బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగుతామని భావించిన శివసేన.. చివరి నిమిషంలో దీదీకి మద్దకు ప్రకటిస్తున్నట్లు చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.

బెంగాల్లో దీదీ వర్సెస్ బీజేపీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఏకంగా 8 విడతల్లో జరగబోతున్న ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఇందులో బీజేపీతో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు చావో రేవోగా మారిపోయాయి. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా కీలక పార్టీల నేతలంతా ఆమెకు అండగా నిలుస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆమె సాగిస్తున్న పోరు విజయవంతం కావాలని వారంతా కోరుకుంటున్నారు. దీంతో దీదీకి బెంగాల్ ఎన్నికలకు ముందే భారీ నైతిక మద్దతు లభిస్తోంది. బీజేపీతో ముఖాముఖీ పోరాడుతున్న మమతను ఆయా పార్టీలు బెంగాల్ టైగర్‌గా అభివర్ణిస్తున్నాయి.
ఆర్జేడీ, ఎస్పీ బాటలోనే శివసేన మద్దతు
పశ్చిమబెంగాల్లో తమ ఉమ్మడి శత్రువు బీజేపీతో ముఖాముఖీ తలపడుతున్న మమతా బెనర్జీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు సైతం ఆదర్శంగా మారిపోయారు. గతంలో బెంగాల్లో బరిలోకి దిగి అదృష్టం పరీక్షించుకోవాలని భావించిన పార్టీలు సైతం ఇప్పుడు బీజేపీతో ఆమె సాగిస్తున్న పోరుకు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుని మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో తృణమూల్ అధినేత్రికి ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు మమతకు మద్దతు ప్రకటించగా.. ఇవాళ శివసేన కూడా దీదీకి అండగా నిలవాలని నిర్ణయించింది. దీంతో మమత ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు.

మమత 'రియల్ బెంగాల్ టైగ్రెస్' అన్న శివసేన
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మమతా బెనర్జీకి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని శివసేన నేత సంజయ్‌రౌత్ ప్రకటించారు. ఆమె నిజమైన బెంగాల్ టైగ్రెస్ అని అభివర్ణించారు. దీదీ వర్సెస్ అన్నీ అన్నట్లుగా మారిపోయిన పోరులో ఆమెకు అండగా నిలుస్తామని రౌత్ వెల్లడించారు. మమత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సంజయ్ రౌత్ ఓ ట్వీట్‌లో తెలిపారు. మహారాష్ట్రలో తమ మహావికాస్ అఘాడీ సర్కారులోని భాగస్వామ పార్టీ ఎన్సీపీ ఇప్పటికే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టు కట్టిన నేపథ్యంలో శివసేన నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

బెంగాల్ కాంగ్రెస్ తీరుపై విమర్శలు
బెంగాల్లో బీజేపీని ఎదుర్కొంటూ హోరాహోరీ పోరు సాగిస్తున్న మమతకు మద్దతివ్వాలని మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ సర్కారులోని రెండు కీలక పార్టీలు ఎన్సీపీ, శివసేన నిర్ణయించుకున్న నేపథ్యంలో అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం లెఫ్ట్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీతో కలిసి జట్టు కట్టి మరో కూటమి పేరుతో పోటీ చేస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో బీజేపీతో పోరులో మమతకు అండగా నిలవాల్సిన సమయంలో సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ వేరు కూటమి ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.