రాహుల్ గాంధీని చంపేస్తాం: తమిళంలో బెదిరింపులు లేఖలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపు లేఖలు వచ్చాయి. మా నాయకుడికి భద్రత పెంచాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు వినపతి పత్రాలు సమర్పిస్తున్నారు. పలు చోట్ల ధర్నాలు చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అహమ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని వినతి పత్రం సమర్పించారు. బెదిరింపు ఉత్తరాలు పంపిన ఘటనపై విచారణ చేపట్టాలని మనవి చేశారు.
రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని అంతం చేస్తామని బెదిరింపు లేఖలు రావడంతో కాంగ్రెస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పుదేచ్చేరి పార్టీ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు. బెదిరింపు లేఖలు తమిళంలో రాశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications