మళ్ళీ భారత్ లో కేసుల పెరుగుదలకు కారణమిదే .. తాజాగా 26,727 కొత్త కేసులు, 277 మరణాలు
భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇటీవల 20 వేల దిగువకు పడిపోయిన కరోనా కొత్త కేసులు, తాజాగా మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 26,727 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత 24 గంటల్లో 277 మరణాలు సంభవించాయి. నిన్న నమోదైన కేసుల కంటే తాజా కేసులు 13 శాతం ఎక్కువ. కేరళలో కేసులు పెరగటమే మళ్ళీ కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది.

తగ్గుతున్న యాక్టివ్ కేసులు, పెరుగుతున్న రికవరీలు
శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ షేర్ చేసిన డేటా ప్రకారం, గత 24 గంటల్లో దేశం మొత్తం 28,246 రికవరీలను నమోదు చేసింది. మొత్తం రికవరీ రేటు 97.85 శాతంగా ఉంది. దేశంలో మొత్తం రికవరీలు 3,30,43,144 కి చేరుకున్నాయి. భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 యాక్టివ్ కేసులు 2,75,224 కి తగ్గాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కన్నా తక్కువ, ప్రస్తుతం 0.90% గా ఉన్నట్టు పేర్కొంది. భారతదేశంలో, కోవిడ్ మహమ్మారి కారణంగా మొదటి మరణం మార్చి 2020 లో నమోదు కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,48,339 కి చేరుకుంది.

నిన్న పరీక్షలు , వ్యాక్సినేషన్ లెక్కలు ఇలా
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, కోవిడ్ -19 నిర్ధారణ కోసం సెప్టెంబర్ 30 వరకు 57,04,77,338 నమూనాలను పరీక్షించింది. వీటిలో గత 24 గంటల్లో 15,20,899 నమూనాలను పరీక్షించారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. గురువారం 64.40 లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం వ్యాక్సిన్ డోస్ ల సంఖ్య 89.02 కోట్లకు చేరుకుంది.

కరోనా కేసుల సంఖ్య పెరుగుదలకు కేరళ కారణం
ఇదిలా ఉంటే దేశంలో కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రభావితమైన రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ప్రస్తుత కేసుల సంఖ్య పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త కేసుల నమోదులో అగ్రస్థానంలో నిలిచిన కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 15,914 మంది కరోనా మహమ్మారి బారిన పడగా 122 మంది మరణించారు. దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 3063 మంది బాధితులుగా మారారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 56 మంది మరణించారు.

ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలు ఇవే
ఆ తర్వాత గత 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలో 1612 మంది కరోనా బారిన పడ్డారు. 28 మంది మరణించారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో మిజోరాంలో 1741 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1010 కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. కర్ణాటకలో 933 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 14 మంది మృతి చెందారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 749 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 15 మంది మరణించారు.
Recommended Video

కేసుల కంటే రికవరీలే ఎక్కువ .. తగ్గుతున్న మరణాలు ఊరట నిచ్చినా .. అలెర్ట్ గా ఉండాల్సిందే
ఇక రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం ప్రస్తుతం భారతదేశానికి ఊరట కలిగిస్తున్న అంశం. అంతేకాదు ప్రస్తుతం మరణాలు కూడా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కరోనా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా అప్పుడే మనల్ని వదిలి పోదని, అలెర్ట్ గా ఉండాల్సిందే అని కేంద్రం పదేపదే హెచ్చరిస్తుంది. వ్యాక్సిన్లు తీసుకున్నా మహమ్మారి సోకే ప్రమాదం ఉందని అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications