పెళ్లి కుదిరింది.. ఇంతలోనే 'యాసిడ్ దాడి'! మృత్యువుతో పోరాడుతోన్న యువతి..
లీటర్ బాటిల్ లో యాసిడ్ తీసుకొచ్చిన దుండగులు ఆమె ముఖంపై పోశారు. దీంతో ఆమె ముఖం, ఛాతీ, ఇతర భాగాలు కాలిపోయాయి.
ఘజియాబాద్: పెళ్లి నిశ్చయమైన ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు. అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గులిస్తా(21)కి కుర్జా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టుకోవాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈలోపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో గత రాత్రి 2గం. నుంచి 3గం. ప్రాంతంలో గులిస్తా ఇంట్లో కొంతమంది దుండగులు చొరబడ్డారు.

లీటర్ బాటిల్ లో యాసిడ్ తీసుకొచ్చిన దుండగులు ఆమె ముఖంపై పోశారు. దీంతో ఆమె ముఖం, ఛాతీ, ఇతర భాగాలు కాలిపోయాయి. దాడి సమయంలో గులిస్తా అరపులు విని అగ్నిప్రమాదం అని భావించామని, కానీ యాసిడ్ దాడి జరిగినట్లుగా తెలిసిందని ఆమె సోదరి సంజీదా అన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువతి కోలుకుంటే ఆమె నుంచి వాంగ్మూలం సేకరించి కేసు దర్యాప్తును ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. బాధిత యువతి లేదా ఆమె కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులే ఈ దాడికి తెగబడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications