సిద్ధరామయ్య రాజీనామా వేళ.. బెంగళూరును వీడి వెళ్లిన కర్ణాటక గవర్నర్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉదయం తన అధికార నివాసంలో మంత్రులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. మంత్రివర్గ సహచరులందరికీ ధన్యవాదాలు చెప్పడానికే సిద్ధరామయ్య ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా మంత్రివర్గ సహచరులందరూ హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్ ఉన్నారు.
ఈ అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్యను డీకే శివకుమార్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గౌరవపూరకంగా పాదనమస్కారం చేశారు. ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ వెన్ను తట్టి ప్రోత్సహించారాయన. ఈ సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయబోతోన్నాననే విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసిందని అన్నారు.

దీంతో సిద్ధరామయ్య రాజీనామా ఖరారైంది. ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. అనూహ్యంగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బెంగళూరును వీడి వెళ్లారు. తన స్వస్థలానికి బయలుదేరి వెళ్లారు. కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా బుధవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో తొలుత ముంబైకి వెళ్లారు. మధ్యప్రదేశ్ లోని నాగ్డా ఆయన స్వస్థలం. ఈ ఉదయం 8 గంటల సమయంలో ఇండోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి కారులో నాగ్డాలోని ఇంటికి చేరుకున్నారు.
గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో.. సిద్ధరామయ్య రాజీనామా సమర్పణపై సందిగ్ధత నెలకొంది. అయినా సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయానికి అందజేస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. గవర్నర్ రాష్ట్రం లేదా దేశం వెలుపల ఉన్నా కూడా ముఖ్యమంత్రి రాజీనామాను సమర్పించవచ్చు. దాన్ని ఆయన ఆమోదించవచ్చు కూడా. రాజీనామాను ఆమోదించడానికి గవర్నర్ స్వయంగా లోక్ భవన్ లో ఉండాల్సిన అవసరం లేదు.
#WATCH | Karnataka Governor Thaawarchand Gehlot arrives at his residence in Nagda, Madhya Pradesh. pic.twitter.com/5ev3xujzdj
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 28, 2026
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ముఖ్యమంత్రి తన రాజీనామాను నేరుగా లోక్ భవన్ అధికారులకు అందజేయవచ్చు. లేదంటే ఫ్యాక్స్ లేక ఈమెయిల్ ద్వారా గవర్నర్‌కు పంపవచ్చు. గవర్నర్ పదవి లోక్ భవన్ కు మాత్రమే పరిమితమైనది కాదని, రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా ఎక్కడి నుండైనా పరిపాలనా పనులను, అధికారిక లేఖలను ఆమోదించగలరని న్యాయనిపుణులు చెబుతున్నారు. 0గవర్నర్ అధికార పరిధి అత్యంత విస్తృతమైనదని పేర్కొంటోన్నారు.












Click it and Unblock the Notifications