తెలుగు మీడియం: తమిళనాడు మంత్రి అయ్యాడు
చెన్నై: తెలుగు పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఓ సామాన్య రైతు తమిళనాడులో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇంత కాలం తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ఒక్కరికి మంత్రి పదవి దక్కలేదు. ఆ చరిత్రను హోసూరు శాసన సభ్యుడు పి. బాలక్రిష్ణ్రా రెడ్డి తిరగరాశారు.
జయలలిత క్యాబినెట్ లో పశు వైద్య శాఖ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. సోమవారం జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత నలుగురిని మంత్రులుగా నియమించాలని జయలలిత నిర్ణయించారు.

ఆ నలుగురిలో బాలక్రిష్ణ్రారెడ్డి ఒకరు. బెంగళూరు నగరానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న హోసూరు పట్టణ మునిసిపల్ చైర్మెన్ గా పని చేశారు. మొదటి సారి బాలక్రిష్ణారెడ్డి కి ఎంఎల్ఏ టిక్కెట్ వచ్చింది. ఎంతో కాలంగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంటున్న హోసూరులో మొదటి సారి అన్నా డీఎంకే జెండా పాతింది.
హోసూరు లో ఇంత కాలం కాంగ్రెస్ శాసన సభ్యుడిగా ఉన్న తెలుగు వ్యక్తి గోపినాథ్ మీద ఘనవిజయం సాధించారు. హో సూరు శాసన సభ నియోజక వర్గంలో 45 శాతం మంది తెలుగు వారు ఉన్నారు. హోసూరు సమీపంలోని బాగలూరులోని తెలుగు పాఠశాలలో బాలక్రిష్ణారెడ్డి ఎస్ఎస్ఎల్ సీ (10వ తరగతి) చదువుకున్నారు.
బాలక్రిష్ణారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. అంచలంచెలుగా పైకి వచ్చి నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. హోసూరు పట్టణంలో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయన శక్తి వంచనలేకుండా పని చేశారు. అంతే కాకుండా ఆయన సామాజిక వర్గం ఓట్లు పడటంతో గెలుపోందారు. హోసూరులో అన్నా డీఎంకే కార్యకర్తలు పండగ జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications