అన్నాడీఎంకే ఎంపీ మహ్మద్ జాన్ ఆకస్మిక మృతి: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొద్దిసేపటికే
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మహ్మద్‌జాన్(72) ఆకస్మికంగా మరణించారు. వేలూరు జిల్లా రానిపేట్‌లోని తన నివాసంలో మంగళవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాగా, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న క్రమంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఎన్ఎం సుగుమార్ తరపున మంగళవారం మధ్యాహ్నం ఇంటింటి ప్రచారంలో మహ్మద్ జాన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లే ముందు కూడా ఆయన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.

మధ్యాహ్నం భోజనం అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయనకు ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆయనను కుటుంబసభ్యులు కారులో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మహమ్మద్ జాన్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎకేం అధ్యక్షుడు స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, 2019 జులైలోనే మహ్మద్ జాన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2011లో ఆయన తమిళనాడులో మంత్రిగానూ పనిచేశారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మహ్మద్‌జాన్ రాజ్యసభలో మద్దతు తెలిపారు. దీంతో రాణిపేట నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గానికి చెందినవారు ఆందోళనలు చేపట్టారు.












Click it and Unblock the Notifications