పన్నీర్ సెల్వం తిరుగుబాటు ! వెంట 31 ఎమ్మెల్యేలు, ఇక శశికళకు చుక్కలే
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి అమ్మ జయలలిత కోసం తన పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు ఇష్టం లేకపోయినా బలవంతంగా శశికళ కోసం సీఎం పదవికి రాజీనామా చేశారు.
శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న 31 మంది దళిత ఎమ్మెల్యేలు మంగళవారం మద్యాహ్నం పన్నీర్ సెల్వం గూటికి చేరిపోవడంతో శశికళ వర్గీయులు షాక్ కు గురైనారు. పన్నీర్ సెల్వం కచ్చితంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలను దగ్గరకు తీసుకుని శశికళను ఎదిరించడానికి సిద్దం అయ్యారని మంగళవారం శశికళ వర్గీయులు పసిగట్టారు.
ప్రజల మద్దతు లేకపోవడం, ఎలాంటి రాజకీయ అనుభవం లేని శశికళ చేతిలో తమిళనాడు ప్రజల జీవితాలు పణంగా పెట్టడం మంచిది కాదని, అందుకే తిరుగుబాటుకు సిద్దం కావాలని చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలిసింది.

అయితే పన్నీర్ సెల్వం తన వర్గీయులు, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నాడీఎంకే పార్టీలోని నాయకులు కొందరు అంటున్నారు. పన్నీర్ సెల్వంకు ఇప్పటికే ఎంజీఆర్ బంధువులు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే..
పన్నీర్ సెల్వం రెబల్ ఎమ్మెల్యేలను ఒక్క తాటిపైకి తీసుకు వచ్చి అన్నాడీఎంకే పార్టీని కాపాడుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీ సైతం పన్నీర్ సెల్వం పనితీరుపై సంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పన్నీర్ సెల్వం ఏమీ చేస్తారు ? అని తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications